Sabarimala: శబరిమలలో తీవ్ర అపచారం.. అయ్యప్ప స్వామి బంగారు కిరీటం మాయం

Sabarimala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన, విలువైన బంగారు కిరీటం విషయంలో తీవ్ర వివాదం తలెత్తింది.

CR Reddy
Published on: 24 Sept 2026 9:41 AM IST
Sabarimala temple
X

Sabarimala temple

Sabarimala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన, విలువైన బంగారు కిరీటం విషయంలో తీవ్ర వివాదం తలెత్తింది. సన్నిధానంలోని అత్యంత భద్రతా కలిగిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బంగారు కిరీటం మాయమైనట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు కిరీటానికి బదులుగా అదే నమూనాలో ఉన్న మరో నకిలీ కిరీటం లభ్యం కావడంతో ఈ వ్యవహారం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ ఘటనపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తీవ్రంగా స్పందించి తక్షణ విచారణకు ఆదేశించింది.

అసలు కిరీటానికి నకిలీ కిరీటానికి మధ్య భారీ బరువు తేడా

అధికారిక రికార్డుల ప్రకారం.. గతంలో 2012 ఆగస్టు నెలలో తమిళనాడుకు చెందిన భక్తులు శబరిమల అయ్యప్ప స్వామికి ఒక సుందరమైన బంగారు కిరీటాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆ సమయంలో లెక్కించిన ప్రకారం ఆ కిరీటం బరువు సరిగ్గా 445.78 గ్రాములుగా అధికారిక పత్రాలలో నమోదైంది. అయితే ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు విలువైన వస్తువుల తనిఖీ నిర్వహించగా, స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఆ కిరీటాన్ని తూకం వేశారు. ఈ తూకంలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. అసలు కిరీటం బరువు ఉండాల్సిన చోట కేవలం 240 గ్రాముల బరువున్న కిరీటం మాత్రమే ఉండటంతో అందరూ విస్మయానికి గురయ్యారు.

హైకోర్టు ఆదేశాలు, అమిసక్ క్యూరీ తనిఖీలు

కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ ఆధ్వర్యంలో ఆలయంలోని విలువైన వస్తువుల జాబితా తయారీ, తనిఖీ ప్రక్రియను చేపట్టారు. ఈ తనిఖీల సమయంలోనే కిరీట బరువులో భారీ వ్యత్యాసం బయటపడింది. అయితే అత్యంత సురక్షితంగా ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్‌లో అసలు నిఘా కెమెరాలు లేకపోవడం ఈ దర్యాప్తును మరింత సంక్లిష్టం చేస్తోంది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఆ కిరీటాన్ని వేరే ప్రాంతంలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు దానిని గమనించలేదని తెలుస్తోంది.

మరిన్ని ఆలయాల్లోనూ వెలుగు చూస్తున్న అవకతవకలు

ఈ తనిఖీల కేవలం శబరిమలతో ఆగిపోకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలలో కూడా విస్తరించినట్లు సమాచారం. ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన నాలుగు పవన్‌ల బంగారు హారం(32గ్రాముల) అలాగే తిరువనంతపురంలోని మరో పురాతన ఆలయానికి చెందిన వెండి అలంకరణ వస్తువులు కూడా కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కిరీటం ఏమాత్రం మిస్ కాలేదని దేవస్థానం కమిషనర్ వాదిస్తున్నప్పటికీ, తనిఖీ సమయంలో అసలు కిరీటం అక్కడ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.