మహారాష్ట్రలో 'ఆపరేషన్ టైగర్' కలకలం.. ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్ల ఆఫర్ అంటూ సంజయ్ రౌత్ సంచలన ట్వీట్!
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఫిరాయింపుల వేడితో రగులుతున్నాయి.
మహారాష్ట్రలో 'ఆపరేషన్ టైగర్' కలకలం.. ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్ల ఆఫర్ అంటూ సంజయ్ రౌత్ సంచలన ట్వీట్!
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఫిరాయింపుల వేడితో రగులుతున్నాయి. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో త్వరలోనే భారీ చీలిక రాబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ పార్టీ ఎంపీలను ప్రలోభపెట్టేందుకు భారీగా డబ్బు ఆఫర్ చేస్తున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ముందుగా సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. యూబీటీ ఎంపీలను పార్టీ మార్చేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్ బ్రాండ్ నాయకురాలు మహువా మొయిత్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. "కేవలం 15 కోట్లేనా? గతంలో మా ఎంపీలకు రూ.4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి, ఆ తర్వాత 36 నెలల పాటు నెలకు రూ.కోటి చొప్పున ఇచ్చేలా ఆఫర్ చేశారు.. ఇదంతా హనీ ప్లస్ మనీ" అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
మహువా మొయిత్రా పోస్ట్‌కు సంజయ్ రౌత్ వెంటనే తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "మహువా జీ.. ఒక్కో ఎంపీకి కనీస మద్దతు ధర (MSP) రూ.50 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఆ రూ.15 కోట్లు కేవలం అడ్వాన్స్ మాత్రమే. నిజం చెప్పాలంటే వ్యక్తిగతంగా ఆ ఎంపీలు రూ.50,000 కూడా విలువ చేయరు. కానీ శివసేన, టీఎంసీ అనే బ్రాండ్ లేబుల్స్ వారిపై ఉండటం వల్లే మార్కెట్లో వారికి అంత ధర పలుకుతోంది" అంటూ అత్యంత ఘాటుగా ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన (యూబీటీ) ఎంపీలను టార్గెట్ చేస్తూ 'ఆపరేషన్ టైగర్' నడుస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం యూబీటీకి ఉన్న తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలలో ఏకంగా ఏడుగురు ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరంతా తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ ఏడుగురు ఎంపీలు సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అసలైన శివసేన పార్టీలో చేరడం దాదాపు ఖాయమనే వార్తలు ఉద్ధవ్ క్యాంపులో వణుకు పుట్టిస్తున్నాయి.




