Supreme Court: మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court: మతమార్పిడి పొందిన వారికి బీసీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పు. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత.

Arun Chilukuri
Published on: 15 Oct 2026 12:49 PM IST
Supreme Court: మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

Supreme Court: మతమార్పిడి, బీసీ (BC) రిజర్వేషన్ల లబ్ధిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి (ప్రత్యేకించి ఇస్లాం/ముస్లిం) మారిన వ్యక్తులు.. కేవలం మతమార్పిడి ఆధారంగా వెనకబడిన తరగతుల (BC) కోటాను క్లెయిమ్ చేసుకోలేరని తేల్చిచెప్పింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఒక వ్యక్తి హిందూ మతంలో ఉన్నప్పుడు అనుభవించిన సామాజిక వెనకబాటుతనాన్ని లేదా కుల హోదాను.. మరొక మతంలోకి మారిన తర్వాత నేరుగా ఆ మతంలోని బీసీ కేటగిరీకి వర్తింపజేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇస్లాంలోకి లేదా ఇతర నాన్-హిందూ మతాల్లోకి మారినంత మాత్రాన స్వయంచాలకంగా బిసి ముస్లిం (BC Muslim) రిజర్వేషన్ అర్హత లభించదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇస్లాంలోకి మారిన వారికి బీసీ ముస్లిం కోటా కింద రిజర్వేషన్ వర్తింపజేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పునే సమర్థించింది.

ఈ తీర్పు దేశవ్యాప్తంగా మతమార్పిడిలు, రిజర్వేషన్ల లబ్ధిపై జరుగుతున్న చర్చల్లో అత్యంత కీలక మైలురాయిగా నిలవనుంది. కేవలం రిజర్వేషన్ ఫలాలు పొందేందుకు లేదా మతం మారిన వెంటనే బీసీ హోదాను డిమాండ్ చేయడానికి ఈ తీర్పుతో చెక్ పడినట్లయింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.