Snake Bite: పాముకాటుకు సరికొత్త మందు.. భారత శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ
Snake Bite: పాముకాటు మరణాలు భయపెడుతున్న వేళ శాస్త్రవేత్తలు వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు.
Snake Bite
Snake Bite: పాముకాటు మరణాలు భయపెడుతున్న వేళ శాస్త్రవేత్తలు వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. వందేళ్లుగా వాడుకలో ఉన్న జంతు ఆధారిత పద్ధతులకు స్వస్తి పలుకుతూ, ల్యాబ్‌లోనే బయోటెక్నాలజీ సాయంతో ప్రమాదకరమైన పాము విషాన్ని క్షణాల్లో నిర్వీర్యం చేసే పవర్ఫుల్ రీకాంబినెంట్ యాంటీవెనమ్‌ను అభివృద్ధి చేసి అద్భుత విజయం సాధించారు.
భారత్, డెన్మార్క్ శాస్త్రవేత్తల చారిత్రాత్మక విజయం
బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ విప్లవాత్మక విరుగుడును రూపొందించారు. గత శతాబ్దకాలంగా గుర్రాలు, గొర్రెలకు పాము విషాన్ని ఎక్కించి, వాటి రక్తంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీల నుంచి యాంటీవెనమ్ తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పాత పద్ధతి వల్ల బాధితులకు తీవ్రమైన పార్శ్వప్రభావాలు రావడం, ఒక రకం పాము విషానికి తయారు చేసిన మందు మరొక రకానికి పనిచేయకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ అడ్డంకులకు చరమగీతం పాడుతూ శాస్త్రవేత్తలు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
విషాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ
పరిశోధకులు ఆఫ్రికన్ పాము విషాన్ని తట్టుకునే జంతువుల యాంటీబాడీ భాగాలను వేరు చేసి ఐదు రకాల నానోబాడీలతో ప్రత్యేక మిశ్రమాన్ని రూపొందించారు. మనదేశంలో అత్యంత ప్రమాదకరమైన స్పెక్టకిల్డ్ కోబ్రా (తాచుపాము), మోనోకిల్డ్ కోబ్రా (చంద్రనాగు) విషంపై ఈ మిశ్రమాన్ని పరీక్షించగా అది అద్భుతంగా పనిచేసింది. ఈ కొత్త విరుగుడు పాము విషంలో ఉండే విషపూరిత ప్రొటీన్లను వె వెంటనే కట్టిపడేసి, శరీరంపై వాటి ప్రభావం పడకుండా పూర్తిగా అడ్డుకోగలిగింది.
ఎలుకలపై ప్రయోగాలు సక్సెస్
ప్రయోగశాలలో ఎలుకలకు తీవ్రమైన పాము విషాన్ని ఎక్కించిన తర్వాత ఈ కొత్త యాంటీబాడీ మిశ్రమాన్ని ఇంజెక్ట్ చేశారు. విషం శరీరంలోకి వెళ్లిన అరగంట తర్వాత ఈ మందు అందించినా ఎలుకలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డాయి. విష ప్రభావం వల్ల తీవ్రమైన నరాల బలహీనత, పక్షవాత లక్షణాలకు గురైన ఎలుకలు సైతం ఈ విరుగుడుతో చాలా త్వరగా కోలుకున్నాయని ఐఐఎస్సీ అసోసియేట్ ప్రొఫెసర్ కార్తీక్ వెల్లడించారు.
భవిష్యత్తు తరాలకు ప్రాణ రక్షణ కవచం
ప్రస్తుతం విరుగుడు తయారీ కోసం జంతువులపై ఆధారపడాల్సి వస్తుండగా, భవిష్యత్తులో బ్యాక్టీరియా లేదా మానవజనిత వ్యవస్థల ద్వారా ల్యాబ్‌లోనే ఈ యాంటీవెనమ్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమైంది. తక్కువ ఖర్చుతో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లభించే ఈ కొత్త మందు.. పాముకాటు మరణాలు ఎక్కువగా సంభవించే భారత్ లాంటి దేశాల్లో రాబోయే తరాలకు ఒక సంజీవనిలా మారనుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




