Sharad Pawar: పీఎం మోదీతో శరద్ పవార్ భేటీ.. మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..

Sharad Pawar: ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 22 July 2026 12:57 PM IST
Sharad Pawar
X

Sharad Pawar: పీఎం మోదీతో శరద్ పవార్ భేటీ.. మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..

Sharad Pawar: నీట్ (NEET) పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, తన కుమార్తె ఎంపీ సుప్రియా సూలేతో కలిసి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) వచ్చిన శరద్ పవార్‌కు ప్రధాని మోదీ స్వయంగా గుమ్మం వద్దకు ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ భేటీలో ముఖ్యంగా రైతుల సమస్యలు, సాగు సంబంధిత ఇబ్బందులపై శరద్ పవార్ ప్రధానికి ఒక మెమొరండమ్‌ను సమర్పించారు. అయితే, సమావేశం ముగిసిన వెంటనే సుప్రియా సూలే ప్రతిపక్షాల విపక్ష భేటీకి హాజరుకావడం గమనార్హం.

కేవలం రైతుల సమస్యలకే ఈ భేటీ పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్‌లో రెండొంతుల మెజార్టీ సాధించేందుకు కేంద్రం మద్దతు కూడగట్టే పనిలో ఉంది.

ఇటీవల మహా వికాస్ అఘాడీ (MVA) కూటమిలోని శివసేన (యుబిటి)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ శిందే వర్గంలో చేరడంతో విపక్ష కూటమిలో అలజడి మొదలైంది. కొద్దిరోజుల క్రితం ఏక్‌నాథ్ శిందేతో కూడా పవార్ భేటీ అయ్యారు. రెండుగా చీలిపోయిన ఎన్సీపీ వర్గాలు మళ్లీ విలీనమై ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ హైప్రొఫైల్ భేటీ మహారాష్ట్రతో పాటు కేంద్ర రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు తెరతీసేలా కనిపిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story