Shashi Tharoor: మాజీ విద్యాశాఖ మంత్రికి స్వాగతం పలకడం విద్యార్థులను అవమానించడమే!
Shashi Tharoor: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026పై ప్రతిపక్షాల వైఖరిని వివరించిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.
Shashi Tharoor: మాజీ విద్యాశాఖ మంత్రికి స్వాగతం పలకడం విద్యార్థులను అవమానించడమే!
Shashi Tharoor: పరీక్షా పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026’ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ తిరిగి సజావుగా సాగాలని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన సమస్యపై ప్రతిపక్షం తన గొంతుకను గట్టిగా వినిపిస్తుందని ఆయన తెలిపారు.
సభలో మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఓం బిర్లా చర్చ చేపడతారని ప్రకటించిన అనంతరం థరూర్ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ నూతన సవరణ బిల్లు ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ సమస్యకు నిజమైన ముగింపు లభిస్తుందా లేదా అనే అంశాన్ని ప్రతిపక్షాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని, సభలో జరిగే చర్చలో భాగస్వామ్యం అవుతాయని తెలిపారు.
కేవలం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం లేదా కొన్ని చట్టపరమైన నిబంధనలను సవరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి రక్షణ లభిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. తుడిచిపెట్టుకుపోతున్న పరీక్షల విశ్వసనీయతను పునరుద్ధరించడానికి మూలాల నుంచి సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక్క మంత్రి రాజీనామా చేయడంతోనే సమస్య పరిష్కారం కాదని, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ జవాబుదారీతనమే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.
నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలకడం పట్ల థరూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యానికి నైతికత రంగు పులిమి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్న ఆయన.. పరీక్షల వ్యవస్థ వైఫల్యంతో నష్టపోయిన విద్యార్థులు, వారి కుటుంబాల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనని విమర్శించారు.




