Mutton on Funeral: శ్మశానంలో దారుణం.. చితి మంటలపైనే మటన్ వండుకున్న తాగుబోతులు..!

Mutton on Funeral: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్‌లో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది.

Gagan kumar
Published on: 23 Sept 2026 11:44 AM IST
Mutton on Funeral
X

Mutton on Funeral: శ్మశానంలో దారుణం.. చితి మంటలపైనే మటన్ వండుకున్న తాగుబోతులు..!

Shahjahanpur: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత వికృత ఘటన వెలుగు చూసింది. కన్నతండ్రి లాంటి ఓ వృద్ధుడి అంత్యక్రియలు ముగిసి, ఆ చితి ఆరకముందే కొందరు వ్యక్తులు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మనిషి ప్రాణం పోయినా, చావు తర్వాత కూడా గౌరవం ఇవ్వాల్సిన శ్మశాన వాటికలో జరిగిన ఈ అమానుషం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

షాజహాన్పూర్ పరిధిలోని నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వీర్పాల్ అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని శ్మశానంలో ఆయన మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వెళ్లిపోయారు.

అయితే మరుసటి రోజు ఉదయం సంప్రదాయం ప్రకారం చితి వద్ద చేయాల్సిన తదుపరి కార్యక్రమాల కోసం మృతుడి కుమారులు శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ వారు కళ్లారా చూసిన దృశ్యం చూసి గుండె పగిలినంత పనైంది. తండ్రి దహనమైన అదే చితి మంటలపై కొందరు వ్యక్తులు హాయిగా మాంసం వండుకుంటున్నారు. అదేంటని మృతుడి కొడుకులు వారిని నిలదీయగా నిందితులు కనీస పశ్చాత్తాపం లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సురేందర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఎంక్వైరీలో నిందితులు చెప్పిన కారణం విని ఖాకీలు సైతం అవాక్కయ్యారు. తాము మద్యం సేవించేందుకు శ్మశానం వద్దకు వెళ్లామని, అయితే మందుతో పాటు నంజుకోవడానికి ఏమీ లేకపోవడంతో సమీపంలో మటన్ తెచ్చి ఆ చితి మంటలపైనే కాల్చుకుని వండుకున్నామని వారు సిగ్గులేకుండా బదులిచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల పట్ల, ఆచారాల పట్ల కనీస గౌరవం లేకుండా కొందరు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చావును కూడా లెక్కచేయకుండా మద్యం మత్తులో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.