Pamban Bridge: పాంబన్‌ వంతెనపై షాకింగ్ ఘటనలు.. గంటల వ్యవధిలో కదులుతున్న రైళ్లలోంచి దూకిన ఇద్దరు ప్రయాణికులు..!

Pamban Bridge: తమిళనాడులోని పాంబన్ వంతెనపై వెళ్తున్న వేర్వేరు రైళ్లలోంచి గంటల వ్యవధిలో ఒక పురుషుడు, ఒక మహిళ కిందకు దూకారు.

Arun Chilukuri
Published on: 17 Nov 2026 11:43 AM IST
Pamban Bridge
X

Pamban Bridge: పాంబన్‌ వంతెనపై షాకింగ్ ఘటనలు.. గంటల వ్యవధిలో కదులుతున్న రైళ్లలోంచి దూకిన ఇద్దరు ప్రయాణికులు..!

Pamban Bridge: తమిళనాడులోని ప్రసిద్ధ పాంబన్‌ వంతెనపై గంటల వ్యవధిలో రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. వంతెనపై వెళ్తున్న వేర్వేరు రైళ్లలోంచి ఒక పురుషుడు, ఒక మహిళ కిందకు దూకడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనల్లో సముద్రంలో దూకిన వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, వంతెన పక్కనే ఉన్న పాత్‌వేపై పడిన మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి రామేశ్వరం నుంచి మదురైకి బయలుదేరిన రైలు పాంబన్‌ వంతెనపై వెళ్తుండగా, అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా సముద్రంలోకి దూకాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం పాంబన్‌ సమీపంలోని ముళ్లిమునై తీరానికి అతని మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆదివారం ఉదయం మరో ఘటన జరిగింది. కేరళ నుంచి రామేశ్వరం బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌ రైలు పాంబన్‌ వంతెనపై వెళ్తుండగా ఓ మహిళ అకస్మాత్తుగా రైల్లోంచి కిందకు దూకింది. అయితే ఆమె సముద్రంలో కాకుండా వంతెన పక్కనే ఉన్న పాత్‌వేపై పడటంతో తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను రక్షించి రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఆమె కేరళ రాష్ట్రానికి చెందిన శివానిగా గుర్తించారు.

కాగా, పాంబన్ వంతెనపై కదులుతున్న రైళ్లలోంచి ప్రయాణికులు కిందకు దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వరుసగా రెండు ఘటనలు జరగడంతో రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.