Prem Singh Tamang: కాన్వాయ్ వదిలేసి రోడ్డెక్కారు! ప్రధాని మోదీ పిలుపుతో 2 కిలోమీటర్లు నడిచిన సీఎం!
Prem Singh Tamang: ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు దిశగా సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్, దిల్లీ సీఎం రేఖా గుప్తా అడుగులు వేశారు.
Prem Singh Tamang: కాన్వాయ్ వదిలేసి రోడ్డెక్కారు! ప్రధాని మోదీ పిలుపుతో 2 కిలోమీటర్లు నడిచిన సీఎం!
Prem Singh Tamang: పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, చమురు సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపునకు దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు అద్భుతంగా స్పందిస్తూ తామే స్వయంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా రెండు కిలోమీటర్ల మేర కాలి నడకన వెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ తన అధికారిక నివాసం నుంచి కార్యక్రమ వేదికకు నడిచి వెళ్లడమే కాకుండా, ప్రోగ్రాం ముగిసిన తర్వాత విలాసవంతమైన సీఎం కాన్వాయ్‌ను పక్కన పెట్టేశారు. సామాన్యుడిలా ఒక లోకల్ ట్యాక్సీని మాట్లాడుకుని అందులోనే తన నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పటి నుంచి సీఎం తమాంగ్ తన నివాసానికి సమీపంలో ఉండే ప్రాంతాలకు కేవలం కాలి నడకనే వెళ్తున్నారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఇంధన పొదుపు కోసం శని, ఆదివారాల్లో ప్రభుత్వ వాహనాలకు 'సరి-బేసి' (Odd-Even) నిబంధనను అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రూల్ నుంచి ప్రైవేట్ వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని చమురు పొదుపు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు, దేశ రాజధాని దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ప్రధాని పిలుపుపై వినూత్నంగా స్పందించారు. సోమవారం ఆమె తన కాన్వాయ్‌ను వదిలి సాధారణ ప్రయాణికురాలిలా దిల్లీ మెట్రోలో ప్రయాణించి సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ప్రతి సోమవారం కచ్చితంగా మెట్రోలోనే ప్రయాణించాలని కోరారు. ప్రభుత్వ వాహనాల కాన్వాయ్‌లను తగ్గించుకోవాలని, వీలైనంత వరకు ఈవీ (ఎలక్ట్రిక్) వాహనాలను మాత్రమే వాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రులే స్వయంగా రోడ్డుపై నడుస్తూ, ప్రజా రవాణాను వాడుతుండటంతో ఇంధన పొదుపుపై ప్రజల్లో సానుకూల చర్చ నడుస్తోంది.




