Sikkim Tunnel Accident : జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో ఏడుగురు మృతి, 27 మంది గల్లంతు
Sikkim Tunnel Accident : సిక్కింలోని తీస్తా జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో మీథేన్ గ్యాస్ పేలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో 27 మంది చిక్కుకోగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Sikkim Tunnel Accident
Sikkim Tunnel Accident : సిక్కిం రాష్ట్రంలో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. నామ్‌చి జిల్లాలోని ఎన్‌హెచ్‌పీసీకి చెందిన తీస్తా స్టేజ్-6 జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ఒక సొరంగంలో భారీ పేలుడు సంభవించింది. సొరంగం లోపల ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ పేరుకుపోయి, ఒక్కసారిగా పేలుడు జరగడంతో కొండచరియలు విరిగిపడి సొరంగం మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఈ విపత్తు సమయంలో లోపల పనిచేస్తున్న 27 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.
అసలేం జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం లోపల దాదాపు 1.5 కిలోమీటర్ల మేర విషపూరితమైన మీథేన్ గ్యాస్ తీవ్రంగా పేరుకుపోయింది. ఈ ప్రమాదకరమైన వాయువును బయటకు పంపించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో ఊహించని విధంగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి టన్నెల్ లోపలి భాగాలు కూలిపోయి శిథిలాలు పడటంతో బయటకు వచ్చే దారి మూసుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు కార్మికులు చాకచక్యంగా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోగా, మరికొందరు లోపలే చిక్కుకుపోయారు.
ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న రెస్క్యూ టీమ్‌లు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న బృందాలకు అక్కడ తీవ్రమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. సొరంగంలో దట్టంగా అలుముకున్న మీథేన్ గ్యాస్, తీవ్రమైన ఆక్సిజన్ కొరత మరియు వెలుతురు లేకపోవడం వల్ల ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. సహాయక చర్యల ప్రారంభంలో ఫైర్ సిబ్బందికి ఊపిరి ఆడక ఇబ్బంది పడటంతో ఆపరేషన్‌ను కాసేపు నిలిపివేయాల్సి వచ్చింది.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
బాధితులను వేగంగా కాపాడేందుకు గాను పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేకమైన గ్యాస్ ప్రొటెక్షన్ గేర్లు ఉన్న ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలం వద్ద అత్యవసర అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. రెస్క్యూ సిబ్బంది గ్యాస్ మాస్క్‌లు, అధునాతన రక్షణ పరికరాలు ధరించి లోపల ఉన్న కార్మికులను చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఇరుకైన మార్గం, విషవాయువుల ముప్పు ఉన్నప్పటికీ అన్ని సహాయక సంస్థలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.




