కాక్‌పిట్‌లో కత్తిపోట్లు.. హనుమాన్ చాలీసా స్మరిస్తూ విమానాన్ని కాపాడాడు
వేలాది అడుగుల ఎత్తులో విమానం గాల్లో పయనిస్తున్న వేళ, సరిగ్గా కాక్‌పిట్‌లోనే చావు అంచులు కనిపించాయి. రక్షణగా ఉండాల్సిన తోటి పైలటే ఒక్కసారిగా ఉన్మాదిలా మారి
Smit Machchhar
వేలాది అడుగుల ఎత్తులో విమానం గాల్లో పయనిస్తున్న వేళ, సరిగ్గా కాక్‌పిట్‌లోనే చావు అంచులు కనిపించాయి. రక్షణగా ఉండాల్సిన తోటి పైలటే ఒక్కసారిగా ఉన్మాదిలా మారి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఒళ్లంతా తీవ్ర గాయాలు, రక్తం ముద్దగా మారిన శరీరం, ప్రాణాలు పోతున్నంత వేదన.. ఒక్క క్షణం తడబడినా విమానంలోని వందలాది మంది ప్రయాణికులు నింగిలోనే బూడిదైపోయే ఘోర పరిస్థితి. అంతటి అత్యంత భయానక క్షణాల్లోనూ ఆ భారతీయ పైలట్ నిబ్బరం కోల్పోలేదు. మనసులోనే ‘హనుమాన్ చాలీసా’ స్మరిస్తూ మృత్యువుతో పోరాడి, ప్రయాణికుల ప్రాణాలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ సాహస వీరుడే ఫ్లైదుబాయ్ విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్.
ప్రధాని నరేంద్ర మోడీ శభాష్.. స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శ
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించారు. ప్రాణాపాయ స్థితిలోనూ స్మిత్ చూపించిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి, నిగ్రహాన్ని ప్రధాని మనసారా ప్రశంసించారు. భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదని, అవసరమైతే ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే గొప్ప నైజం ఉన్నవారని చెప్పడానికి స్మిత్ ప్రత్యక్ష నిదర్శనమని మోడీ కొనియాడారు. అలాగే, స్మిత్‌కు భగవద్గీతలోని గొప్ప సంస్కారం, విలువలను నేర్పించి పెంచిన ఆయన తల్లి గీతా బెన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధానితో సంభాషణలో భావోద్వేగానికి లోనైన కెప్టెన్ స్మిత్
దేశ ప్రధాని స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో కెప్టెన్ స్మిత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "మీరే నాకు ప్రాథమిక ఆదర్శం. నా జీవితంలో మీ నుంచి ఇలాంటి పిలుపు వస్తుందని, మీరు స్వయంగా ధైర్యం చెప్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణం" అని స్మిత్ ఆనందం వ్యక్తం చేశారు.
గాల్లో జరిగిన ఆ దారుణ క్షణాలను గుర్తుచేసుకుంటూ..
ఆ భయానక ఘటనపై కెప్టెన్ స్మిత్ స్పందిస్తూ, దాడి జరిగిన క్షణంలో తాను తీవ్రంగా గాయపడి కింద పడిపోయానని తెలిపారు. "నేను 11 ఏళ్లుగా కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాను. కానీ ఆ రోజు కత్తిపోట్లతో కింద పడిపోయిన క్షణంలో.. ఇప్పుడు గనక నేను లేచి నిలబడకపోతే అందరం చనిపోతామని గ్రహించాను. ఆపద సమయాల్లో హనుమాన్ చాలీసా పఠించడం నాకు అలవాటు. ఆ క్షణంలో కూడా హనుమాన్ చాలీసా స్మరిస్తూనే నా ప్రాణాల కోసం, ప్రయాణికుల రక్షణ కోసం పోరాడాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు" అని వివరించారు.
విమానం ఒక్కసారిగా వేగంగా కిందికి పడిపోతుండటాన్ని గమనించి ప్రయాణికులందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తీవ్రంగా భయపడినట్లు స్మిత్ చెప్పారు. తీవ్రమైన రక్తం ఓడుతున్న గాయాలతోనే, అపారమైన శ్రమకోర్చి కాక్‌పిట్ తలుపులు తెరిచానని.. అది చూసి లోపలికి వచ్చిన ప్రయాణికులు వెంటనే స్పందించి విమానాన్ని తమ అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆనాటి మరణమృదంగాన్ని గుర్తు చేసుకున్నారు. దేవుడిపై భారం వేసి చేసిన ఆ పోరాటమే చివరికి వందలాది మంది ప్రాణాలను కాపాడింది.




