4 ఏళ్ల ప్రేమ.. పెళ్లయిన 12 గంటల్లోనే పెటాకులు! వైరల్ అవుతున్న క్రేజీ క్రైమ్ స్టోరీ!
తమిళనాడులోని కన్యాకుమారిలో పెళ్లయిన రోజే తెగిన బంధం. మద్యం మత్తులో మామపై, భార్యపై చేయి చేసుకున్న ఆర్మీ సైనికుడు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వధువు.
4 ఏళ్ల ప్రేమ.. పెళ్లయిన 12 గంటల్లోనే పెటాకులు! వైరల్ అవుతున్న క్రేజీ క్రైమ్ స్టోరీ!
నాలుగేళ్ల ప్రేమ.. పెద్దల అంగీకారం.. ఎంతో అట్టహాసంగా ఉదయం జరిగిన పెళ్లి.. ఇవేవీ ఆ బంధాన్ని ఒక్క రోజూ నిలపలేకపోయాయి. కేవలం కొన్ని గంటల్లోనే ఆ కొత్త సంసారంలో విషాదం నిండింది. మద్యం మత్తులో తూలుతూ రిసెప్షన్కు వచ్చిన నూతన వరుడు.. ఏకంగా వధువు తండ్రితో గొడవకు దిగి, అడ్డొచ్చిన భార్యపైనే చేయి చేసుకున్న దారుణ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో అదే రాత్రి తండ్రీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించి, భర్తతో తెగదెంపులు చేసుకుని వెనుదిరిగారు.
కన్యాకుమారి జిల్లా కుళచ్చల్ సమీపంలోని రీతాపురానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతడు, కన్యాకుమారి-కేరళ సరిਹద్దు ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువతి (తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్ట్) గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో సోమవారం ఉదయం ఇద్దరికీ ఘనంగా వివాహం జరిగింది.
ఉదయం పెళ్లి జరగగా, అదే రోజు సాయంత్రం వరుడి ఊరిలోని ఓ మండపంలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పూర్తిగా మద్యం మత్తులో తూలుతూ వచ్చిన వరుడు.. అక్కడివారితో విచిత్రంగా ప్రవర్తించాడు.
వరుడు మద్యం తాగి రావడాన్ని గమనించిన వధువు తండ్రి, కూతురు ఏమైందని ఆరా తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ సైనికుడు మామతో తీవ్ర వాగ్వాదానికి దిగి, బూతులు తిడుతూ ఆయనపై దాడికి పాల్పడ్డాడు. భర్తను అడ్డుబోయిన నూతన వధువు అని కూడా చూడకుండా ఆమెపై కూడా చేయి చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
మండపంలో ఊహించని పరిణామాతో షాక్కు గురైన వధువు, ఆమె తండ్రి వెంటనే కుళచ్చల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఉదయం మెడలో తాళి కట్టిన భర్తే క్షణాల వ్యవధిలో తనపై, తండ్రిపై చేయి చేసుకోవడంతో మనస్తాపం చెందిన ఆ యువతి.. ఇక ఆ బంధం వద్దు అంటూ రాత్రికి రాత్రే తండ్రితో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఉదయం ఒక్కటైన జంట, సాయంత్రానికే విడిపోవడం స్థానికంగా కలకలం రేపింది.




