Sonam Wangchuk: రెండో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమా?.. ప్రజలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు
Sonam Wangchuk: దేశాభివృద్ధి కోసం నిజాయతీ, విలువలున్న నాయకులను గుర్తించాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Sonam Wangchuk: రెండో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమా?.. ప్రజలకు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు
Sonam Wangchuk: భారత దేశాన్ని అర్థవంతమైన మార్పు దిశగా నడిపించగల నిజాయతీ కలిగిన నాయకులను గుర్తించడంలో తనకు సాయం చేయాలని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. దేశంలో సరైన రాజకీయ నాయకత్వం లేకపోతే సమాజం, దేశ భవిష్యత్తు తప్పుదారిలోనే పయనిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"ప్రస్తుతం దేశంలో ఉన్న ఎంపీలలో దాదాపు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మందిపై తీవ్రమైన హత్య, అత్యాచార ఆరోపణలు ఉండటం అత్యంత విచారకరం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే మనం 'వికసిత భారత్'గా మారలేం. ప్రపంచ వేదికపై తలఎత్తుకుని నిలబడలేం" అని వాంగ్‌చుక్ అన్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు:
2047 నాటికి మనం గౌరవప్రదమైన దేశంగా మారాలంటే నాయకులను ఎన్నుకునే విధానంలో ఒక శాంతియుత విప్లవం రావాలి.
మీ చుట్టుపక్కల నిజాయతీ, ధైర్యం, సుపరిపాలనపై దృష్టి ఉన్న వ్యక్తులు ఉంటే వారి వివరాలను నాకు తెలియజేయండి.
అవినీతి, తప్పుడు నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలంతా రెండో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమవ్వాలి.
కొద్ది రోజులుగా తాను అనారోగ్యంతో ఉన్నానని, ఆ సమయంలో దేశ భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించానని ఆయన చెప్పారు. తలసరి జీడీపీ పరంగా 50 ఏళ్ల క్రితం మనకంటే ఎంతో వెనుకబడి ఉన్న థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పుడు మనకంటే మెరుగైన పురోగతి సాధించాయని, పొరుగు దేశాలతో పోలిస్తే మన అభివృద్ధి నిరాశపరిచిందని వాపోయ్యారు.
దేశాల సత్వర అభివృద్ధికి ప్రాథమికమైనవి సరైన విద్యా విధానం మరియు సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. విద్యారంగం వెనుకబడి ఉన్నంత కాలం దేశ భవిష్యత్తు పురోగమించలేదని స్పష్టం చేశారు.
అలాగే, కేంద్రంలోనే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు పాలించే రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చే భిన్నాభిప్రాయాలను, నిరసనలను అణచివేయడం సరికాదని ఆయన విమర్శించారు. 2012-13 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ.. సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే దేశం ముందున్న అతిపెద్ద సవాలని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.




