Sonam Wangchuk : దీక్ష ఫలించింది.. కేంద్రం ఇచ్చిన కీలక హామీ
NEET-UG పేపర్ లీక్ ఉదంతం, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు , బాధ్యతాయుతమైన విచారణ కోరుతూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక..
Wangchuk
NEET-UG పేపర్ లీక్ ఉదంతం, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు , బాధ్యతాయుతమైన విచారణ కోరుతూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక వేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఎట్టకేలకు తన దీక్షను విరమించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ రావడంతో గుర్గావ్‌లోని వేదాంత ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించినట్లు వెల్లడించారు.
యూనియన్ మినిస్టర్ల సమక్షంలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ , లెహ్-లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నాయకులు వేదాంత ఆసుపత్రికి చేరుకుని వాంగ్‌చుక్‌కు నిమ్మరసం తాపించి దీక్షను విరమింపజేశారు. ఈ సమయంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీక్ష విరమణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. సోనమ్ జీ వైద్యుల సలహాలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రెండు రోజుల సుదీర్ఘ చర్చలు..
దీక్ష విరమించిన అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గత రెండు రోజులుగా ప్రభుత్వ ప్రతినిధులతో నిరంతరం తీవ్రమైన చర్చలు జరిగాయని, తన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి కచ్చితమైన లిఖితపూర్వక హామీ కావాలని పట్టుబట్టడం వల్లే మరో రెండు రోజులు దీక్ష కొనసాగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఎట్టకేలకు కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖలో ప్రధానంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు , నీట్ పేపర్ లీక్ అక్రమాలపై పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చిస్తామని హామీ లభించింది. దాంతో పాటు జూలై 20న నిర్వహించిన 'చలో పార్లమెంట్' మార్చ్ సహా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా నీట్ పేపర్ లీక్ దెబ్బకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 65 మంది ఎంపీలు ఆయనను కలిసి, ఈ సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని హామీ ఇవ్వడం కూడా ఆయన దీక్ష విరమించడానికి మరొక కారణం.
ఇంకా ఆగని ఆగ్రహం.. సీజేపీ పోరాటం కొనసాగింపు
ఇదిలా ఉండగా, సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తూనే 'కాకరోచ్ జనతా పార్టీ' (CJP) తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. నీట్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసన ఆగదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు.
జూన్ 28న సీజేపీ ఆధ్వర్యంలో మొదలైన ఈ ఆందోళనలో భాగమైన వాంగ్‌చుక్.. 26 రోజుల దీక్షలో ఏకంగా 11 కేజీల బరువు తగ్గారు. ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి, ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వేదాంత ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన తన దీక్షను వీడలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో విద్యార్థుల పోరాటానికి తొలి విజయం లభించినట్లయింది.




