Sonam Wangchuk: నా పవిత్రతకు సర్టిఫికెట్ కావాలా?.. ‘డీల్’ వార్తలపై వాంగ్‌చుక్ కౌంటర్!

Sonam Wangchuk: నిరాహార దీక్ష విరమణపై వస్తున్న విమర్శలపై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఘాటుగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 25 July 2026 11:19 AM IST
Sonam Wangchuk
X

Sonam Wangchuk: నా పవిత్రతకు సర్టిఫికెట్ కావాలా?.. ‘డీల్’ వార్తలపై వాంగ్‌చుక్ కౌంటర్!

Sonam Wangchuk: కేంద్ర మంత్రుల సమక్షంలో 26 రోజుల నిరాహార దీక్షను విరమించడంపై తనపై వస్తున్న విమర్శలు, అనుమానాలపై ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంతో డీల్ కుదిరిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన దీక్ష ఎంత స్వచ్ఛమైందో నిరూపించుకోవడానికి ఎవరి నుంచైనా సర్టిఫికెట్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఏసీ గదిలో కూర్చొని డీల్స్ చేసుకోలేనా?

తనపై వస్తున్న పుకార్లపై వాంగ్‌చుక్ కౌంటర్ ఇస్తూ.. "దీక్ష విరమించినప్పటి నుంచి చాలా మంది నాకు ఫోన్ చేసి సోషల్ మీడియా పోస్టుల గురించి చెబుతున్నారు. కేంద్ర మంత్రుల సమక్షంలోనే ఎందుకు దీక్ష విరమించారు, ఏం ఒప్పందం జరిగిందని అడుగుతున్నారు. బేరాలు కుదుర్చుకోవాల్సి వస్తే ఎవరైనా 26 రోజులు ఆకలితో ఉంటారా? దిల్లీ ఎండలో రోడ్డు పక్కన కూర్చునే బదులు ఏసీ గదిలో కూర్చొని డీల్స్ చేసుకోలేనా?" అని నిలదీశారు.

మంత్రి రాజీనామాపై కీలక వ్యాఖ్యలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై స్పందిస్తూ.. "కేంద్రంతో చర్చల సమయంలో మంత్రి రాజీనామా కంటే, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు లేకుండా చూడటమే నాకు మొదటి ప్రాధాన్యంగా అనిపించింది. అందుకే రాజీనామా కోసం మరీ ఎక్కువ ఒత్తిడి తేలేదు" అని వివరణ ఇచ్చారు.

అయితే, ఈ వ్యవహారం వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా దిగజారుతోందని, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కేంద్రం ఈ అంశాన్ని ఎక్కువ కాలం నాన్చలేదని, త్వరలోనే మంత్రి రాజీనామా సమర్పిస్తారని తాను భావిస్తున్నట్లు వాంగ్‌చుక్ ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story