Sonam Wangchuk: 'చనిపోయినా ఆత్మగానైనా తిరిగొస్తా'.. సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు!

Sonam Wangchuk: నీట్ పరీక్షల లోపాలపై దిల్లీ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరింది.

Arun Chilukuri
Published on: 17 July 2026 3:08 PM IST
Sonam Wangchuk
X

Sonam Wangchuk: 'చనిపోయినా ఆత్మగానైనా తిరిగొస్తా'.. సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు!

Sonam Wangchuk: దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో (NEET-UG వంటివి) జరిగిన లోపాలకు, పేపర్ లీకేజీల వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రముఖ విద్యా, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దిల్లీలో ఉధృతంగా కొనసాగుతోంది. జంతర్‌మంతర్‌ వేదికగా సాగుతున్న ఈ దీక్ష శుక్రవారంతో 20వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు ఆయన శారీరక ఆరోగ్యం అత్యంత క్లిష్టస్థాయికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ దీక్షను విరమించేందుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను బాహ్యంగా చాలా బలహీనపడి, బరువు తగ్గినట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా నా సంకల్పం చాలా బలంగా ఉంది. జులై 20న (పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు) మేము నిర్వహించబోయే 'పార్లమెంట్ మార్చ్' వరకూ నేను ఎలాగైనా ప్రాణాలతోనే ఉంటాను. ఒకవేళ నా శరీరం సహకరించక ప్రాణాలు పోయినా.. ఆత్మగానైనా తిరిగొచ్చి ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ చారిత్రాత్మక పార్లమెంట్ మార్చ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత, కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై, ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంట్‌కు మన విన్నపాన్ని సమర్పించాలని పిలుపునిచ్చారు.

20 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ వాంగ్‌చుక్ చేస్తున్న ఈ సుదీర్ఘ దీక్ష వల్ల ఆయన అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారం దిల్లీ హైకోర్టుకు చేరింది.

వాంగ్‌చుక్‌ ప్రాణాలు కాపాడటం అత్యంత ముఖ్యమని భావించిన హైకోర్టు, దీనిపై గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా గమనిస్తూ, అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు, కేంద్ర మంత్రి స్పందించే వరకు ఈ పోరాటం ఆగేది లేదని సిజిపి (CJP) శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story