Sonia Gandhi: మన్మోహన్‌నే ప్రధానిగా ఎందుకు ఎంచుకున్నారంటే?.. సోనియా గాంధీ ఆత్మకథలో క్లారిటీ!
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలయింది.
Sonia Gandhi: మన్మోహన్‌నే ప్రధానిగా ఎందుకు ఎంచుకున్నారంటే?.. సోనియా గాంధీ ఆత్మకథలో క్లారిటీ!
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love)’ పుస్తకం ద్వారా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల నుంచి రాజకీయ జీవితంలో ఎదురైన కీలక ఘట్టాల వరకు ఎన్నో విషయాలను ఆమె ఈ పుస్తకంలో పంచుకున్నారు. ముఖ్యంగా 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని తిరస్కరించడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సమయంలో తన మనసులో జరిగిన సంఘర్షణను ఆమె స్పష్టంగా వివరించారు.
ఎన్నికలు జరగడానికి చాలా నెలల ముందే తాను ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా తెలిపారు. నానమ్మ, తండ్రి హత్యలను ప్రత్యక్షంగా చూసిన రాహుల్, ప్రియాంక.. తన తల్లి మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని కోరుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఆ పదవి తమ కుటుంబానికి ప్రమాదకరమని వారు భావించినట్లు తెలిపారు. అయితే ఎన్నికల వేళ పార్టీలో నాయకత్వ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో మొదట ఈ విషయాన్ని బయటపెట్టలేదన్నారు.
ఎన్నికల అనంతరం యూపీఏ కూటమి నేతలంతా తన ఇంట్లో సమావేశమైనప్పుడు ప్రధాని పదవి తనకు వద్దు అని చెప్పానని, అయితే నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బలవంతం చేయడంతో మొదట సరేనని అనాల్సి వచ్చిందని సోనియా గుర్తుచేసుకున్నారు. ఆ సమాచారం విన్న ప్రియాంక, రాహుల్ తీవ్ర ఆందోళనకు గురయ్యారని, ప్రియాంక కళ్లు ఎర్రబడటం తనకింకా గుర్తుందని ఆమె రాసుకొచ్చారు. "ఆ రోజు రాత్రి నా మనసులో ఓ యుద్ధం జరిగింది. ఆ క్షణం రాజీవ్ నా పక్కనుంటే బాగుండు అనిపించింది" అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. విదేశీ మూలాలపై ప్రత్యర్థులు వివాదం సృష్టిస్తారనే భయం ఒకవైపు ఉంటే, దేశంపై తనకు ఉన్న బాధ్యత మరోవైపు మెదడును హెచ్చరించాయని పేర్కొన్నారు. చివరకు మనసు చెప్పిందే చేయాలని దృఢ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
మరుసటి రోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఎంపీల ముందు పదవి తీసుకోబోనని స్పష్టం చేసినట్లు సోనియా తెలిపారు. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ పేరును తాను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పదవుల్లో అనుభవం ఉండటం, పార్టీలో ఏ వర్గానికి తలవంచకుండా తటస్థంగా ఉండటం, కమ్యూనిస్టుల వెలుపలి మద్దతు లభించడం వంటి కారణాల వల్లే మన్మోహన్ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు సోనియా గాంధీ తన ఆత్మకథలో వివరించారు.




