Sonia Gandhi: 58 ఏళ్లుగా ఇదే నా ఇల్లు.. భారతదేశమే నా దేశం

Sonia Gandhi: తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Arun Chilukuri
Published on: 17 Nov 2026 12:00 PM IST
Sonia Gandhi
X

Sonia Gandhi: 58 ఏళ్లుగా ఇదే నా ఇల్లు.. భారతదేశమే నా దేశం

Sonia Gandhi: ‘‘నా జీవితంలో 58 ఏళ్లు భారతదేశంలోనే గడిపాను.. ఇదే నా ఇల్లు, ఇదే నా దేశం’’ అని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించిన తన ఆత్మకథ ‘‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’’ అధికారిక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని తన జీవితంలోని ఎన్నో మధుర స్మృతులు, కీలక మలుపులను పంచుకున్నారు. రాజీవ్‌ గాంధీ సొంత నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు తన పట్ల సొంత మనిషిలా చూపిన ఆత్మీయతే ఈ దేశం తన కుటుంబమనే భావన బలపడటానికి కారణమైందని ఆమె తెలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. యువత మరింత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనాలని సోనియా పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ, జెన్‌జీ సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన యువజనులంతా కలిసి తమ హక్కుల కోసం డిమాండ్‌ చేయడం చాలా అవసరమన్నారు. ‘‘యువతకు మనం సలహాలివ్వడం కంటే వారి నుంచి సూచనలు తీసుకోవాలి.. ఎందుకంటే వారే మన భవిష్యత్తు’’ అని ఆమె పేర్కొన్నారు.

తన వ్యక్తిగత జీవితం, గాంధీ కుటుంబంతో అనుబంధం గురించి వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలకు సోనియా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

‘‘కేంబ్రిడ్జ్‌లో నా మిత్రుడి ద్వారా రాజీవ్‌ పరిచయమయ్యారు. ఆ తర్వాత మేము రోజూ లేఖలు రాసుకునేవాళ్లం.’’ ‘‘మొదట్లో ఇందిరా గాంధీని చూస్తే నాకు చాలా భయంగా ఉండేది. ఆమెను ‘మా’ లేదా ‘మమ్మీ’ అని పిలవాలని రాజీవ్ చెప్పినా.. నా ఇటాలియన్‌ ‘మమ్మా’ ఉన్నందున ఆమెను అలా పిలవడానికి నాకు చాలా కాలం పట్టింది. అయితే నాకు పిల్లలు పుట్టాక ఇందిరా గాంధీ పూర్తిగా మారిపోయారు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆ తర్వాత నేనూ ఆమెతో వ్యక్తిగత విషయాలు స్వేచ్ఛగా మాట్లాడగలిగాను.’’

‘‘1970లో మా అత్తగారితో కలిసి మొదటిసారి అలహాబాద్‌కు వెళ్లడం ఎప్పటికీ మరిచిపోలేను. అప్పట్లో నెహ్రూ పుస్తకాలు, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర గురించి చదివాను. అయితే అలహాబాద్‌లోని పూర్వీకుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఉద్యమం వెనుక ఉన్న కుటుంబ నేపథ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. స్వరాజ్‌ భవన్‌ ప్రాంగణంలో విదేశీ వస్త్రాలను కుప్పగా పోసి నిప్పు పెట్టిన చోటు, మోతీలాల్‌ నెహ్రూ ‘నెహ్రూ నివేదిక’ రచించిన గది, మహిళలు ఉప్పు తయారు చేసిన ప్రాంగణాన్ని మా అత్తగారు నాకు దగ్గరుండి చూపించారు. అవన్నీ నా కళ్లకు చారిత్రక ఘట్టాలను కట్టాయి.’’

తన జీవితంలోని అత్యంత కష్టకాలం గురించి వివరిస్తూ.. ‘‘రాజీవ్‌ హత్య నన్ను తీవ్రంగా కుదిపేసింది. ఆ క్లిష్ట సమయంలో నా పిల్లలే నాకు అండగా నిలిచారు. నేను వాళ్లకు ఒక చిన్నపిల్లలా మారిపోయాను. అప్పుడు భద్రతా కారణాల వల్ల మా పిల్లలు ఐదేళ్లపాటు ఇంటికే పరిమితమయ్యారు’’ అని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే 2010లో తాను క్యాన్సర్‌ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రజాజీవితంలో ఉన్నవారికి అనారోగ్యం వస్తే దాన్ని బలహీనతగా చూస్తారని, కానీ కుటుంబ ప్రోత్సాహం, ధైర్యంతో అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలని తాను నమ్ముతానని చెప్పారు. ఈ పుస్తకంలో రాసిందంతా తన జ్ఞాపకాల ఆధారంగానే రాశానని, వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తాను ప్రతిపక్షనేతగా కొన్ని వివరాలు రాసుకున్నవి తప్ప మరే డైరీ నిర్వహించలేదని సోనియా స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.