Sonia Gandhi: "ఆ గ్రీక్ రెస్టారెంట్‌లోనే మా లవ్ స్టోరీ మొదలైంది".. ఎక్స్‌లో సోనియా గాంధీ తొలి పోస్ట్!
Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలోకి ప్రవేశించారు.
Sonia Gandhi: "ఆ గ్రీక్ రెస్టారెంట్‌లోనే మా లవ్ స్టోరీ మొదలైంది".. ఎక్స్‌లో సోనియా గాంధీ తొలి పోస్ట్!
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్)లో అధికారికంగా అడుగుపెట్టారు. త్వరలోనే వెలువడనున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకానికి సంబంధించి తొలి పోస్ట్‌ను ఒక వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఉన్న అమూల్యమైన ప్రేమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తన తొలి పోస్ట్‌లో సోనియా గాంధీ స్పందిస్తూ— ‘‘కేంబ్రిడ్జ్‌లోని ఒక చిన్న గ్రీక్ రెస్టారంట్‌లో మా ప్రేమ ప్రయాణం ప్రారంభమైంది. నేను, రాజీవ్ కలిసి ఎన్నో నవ్వులు, తీపి జ్ఞాపకాలతో ఒక సుందరమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. ఆ జ్ఞాపకాల సమాహారాన్ని నవంబర్ 10న మీ ముందుకు తీసుకువస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఆ వీడియోలో రాజీవ్‌తో కలిసి దిగిన పాత అరుదైన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.
ఆ రోజుల్లో బ్రిటన్ విశేషాలను పంచుకుంటూ, ‘‘అప్పట్లో ఇంగ్లాండ్‌లో ఆహారం అంత బాగుండేది కాదు. ఇటాలియన్ ఫుడ్ కోసం వెతుకుతుండగా ఓ గ్రీక్ రెస్టారెంట్ దొరికింది. అక్కడ కామన్ ఫ్రెండ్ ద్వారా రాజీవ్‌తో పరిచయం ఏర్పడింది. మొదటిసారి చూడగానే ఆయనే నా జీవిత భాగస్వామి అనే భావన మనసులో కలిగింది. ఆయన రూపానికంటే కూడా ఆయనలోని సౌమ్యమైన మనస్తత్వమే నన్ను బాగా ఆకర్షించింది. రాజీవ్‌ను తొలిసారి కలిసిన క్షణాన్ని నేను జీవితంలో మర్చిపోలేను’’ అని చిరునవ్వుతో తెలిపారు.
ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించిన సోనియా గాంధీ, ఇప్పుడు ‘ఎక్స్’ ద్వారా డిజిటల్ వేదికగా ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఆమె రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నవంబర్ 10న మార్కెట్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన తొలి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




