Early Monsoon Alert: ఎండలతో అల్లాడుతున్న జనాలకు ఊరట.. ముందే పలకరించనున్న రుతుపవనాలు!

Early Monsoon Alert: భారత్‌లో ఎండలు ముదురుతున్న వేళ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశాన్ని తాకనున్నాయి. మే చివరి నాటికే కేరళకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri
Published on: 24 April 2026 4:28 PM IST
Early Monsoon Alert
X

Early Monsoon Alert: ఎండలతో అల్లాడుతున్న జనాలకు ఊరట.. ముందే పలకరించనున్న రుతుపవనాలు!

Early Monsoon Alert: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ ముగియక ముందే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరియు యూరోపియన్ వెదర్ ఫోర్కాస్ట్ (ECMWF) ప్రజలకు చల్లని వార్తను అందించాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) సాధారణం కంటే ముందే భారత్‌ను పలకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

అంచనాల ప్రకారం, మే 18 నుండి 25 మధ్యలోనే రుతుపవనాలు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సాధారణంగా అక్కడ కురిసే వర్షపాతం కంటే ఈసారి 30 నుండి 60 మి.మీ అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. అండమాన్ ఉత్తర ప్రాంతంలో ఏర్పడే ఉష్ణమండల వ్యవస్థ కారణంగా రుతుపవనాల కదలిక మరింత వేగవంతం కానుంది.

సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు, ఈ ఏడాది మే 25 నుండి జూన్ 1 మధ్యలోనే కేరళ తీరాన్ని మరియు తమిళనాడులోని దక్షిణ జిల్లాలను తాకే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది కూడా రుతుపవనాలు అంచనా కంటే ముందే వచ్చాయి, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

రుతుపవనాలు త్వరగా రావడం వల్ల ఎండల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, ఖరీఫ్ సాగు పనులు కూడా ముందుగానే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రైతులు త్వరగా విత్తనాలు వేసుకునే అవకాశం కలుగుతుంది. రానున్న వారం రోజుల్లో వాతావరణ శాఖ దీనిపై మరిన్ని అధికారిక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story