మూతపడే దిశగా స్పైస్‌జెట్?.. వారం రోజుల్లో నిధులు రాకపోతే కష్టమే

SpiceJet Crisis: విమానయాన రంగంలో స్పైస్‌జెట్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. తీవ్రమైన నగదు కొరత కారణంగా రోజువారీ షెడ్యూల్డ్ విమానాల్లో సగానికి పైగా..

G Krishna
Published on: 19 Nov 2026 6:16 PM IST
SpiceJet Crisis
X

మూతపడే దిశగా స్పైస్‌జెట్?.. వారం రోజుల్లో నిధులు రాకపోతే కష్టమే

SpiceJet Financial Crisis: విమానయాన రంగంలో స్పైస్‌జెట్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. తీవ్రమైన నగదు కొరత కారణంగా రోజువారీ షెడ్యూల్డ్ విమానాల్లో సగానికి పైగా రద్దు చేస్తున్నట్లు సమాచారం. దీంతో సంస్థ కార్యకలాపాల కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారి, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. 5,500 కోట్ల వరకు నిధులు సమీకరించే ప్రతిపాదనకు ఎయిర్‌లైన్ బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. వారం రోజుల్లోగా కొత్త నిధులు రాకపోతే సంస్థను మూసివేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించినట్లు ఈటీ నివేదిక పేర్కొంది.

షెడ్యూల్‌కు, వాస్తవాలకు భారీ తేడా

శీతాకాలపు షెడ్యూల్‌లో రోజుకు సుమారు 66 విమానాలకు డీజీసీఏ అనుమతి ఇచ్చినప్పటికీ, స్పైస్‌జెట్ మాత్రం రోజుకు కేవలం 15 విమానాలనే నడుపుతోంది. అయితే మొత్తం షెడ్యూల్‌కు బుకింగ్‌లు మాత్రం స్వీకరిస్తూనే ఉంది. లీజు చెల్లింపులు నిలిచిపోవడంతో ఆరు లీజు విమానాలు నిలిచిపోయాయి. బకాయిల కారణంగా మూడు విమానాలను లీజుకు ఇచ్చిన మోల్డోవాకు చెందిన ఫ్లైవన్ సంస్థ సోమవారం ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మంగళవారం ముంబై నుంచి బయలుదేరే అనేక విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. దర్భంగా వెళ్లేందుకు రూ. 10,600 టికెట్ తీసుకున్న నెస్లే ఎగ్జిక్యూటివ్ బిశ్వజిత్ ఘోష్, విమానాశ్రయానికి వెళ్లాక విమానం రద్దయిందని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

రుణ నిరాకరణ.. డీజీసీఏ పర్యవేక్షణపై ప్రశ్నలు

గతంలో రుణాలు ఎగవేసిన చరిత్ర కారణంగా ఈసీఎల్‌జీఎస్ కింద రూ. 350 కోట్ల రుణం ఇవ్వడానికి యెస్ బ్యాంక్ నిరాకరించడంతో సమస్య మరింత తీవ్రమైంది. బ్యాంకుల సాయం లేకుండా కార్యకలాపాలు కష్టమని సీఎండీ అజయ్ సింగ్ గత వారం పౌర విమానయాన కార్యదర్శి సమీర్ సిన్హాను కలిసి హెచ్చరించారు. షెడ్యూల్ పాటించనందుకు డీజీసీఏ షో-కాజ్ నోటీసు ఇచ్చినా, బుకింగ్‌లు నిలిపివేయడానికి ప్రభుత్వం వెనుకాడుతోంది. అలా చేస్తే సంస్థ మూతపడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతుండగా, నడపలేని విమానాలకు టికెట్లు అమ్ముతుండటంపై ట్రావెల్ ఏజెంట్లు, ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.