Kalki Bhagavan passes away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత..క్షేత్రానికి భక్తుల ప్రవాహం!
Kalki Bhagavan passes away: వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ చెన్నైలో కన్నుమూశారు.
Kalki Bhagavan passes away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత..క్షేత్రానికి భక్తుల ప్రవాహం!
Kalki Bhagavan passes away: ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘వన్నెస్’ సంస్థ వ్యవస్థాపకుడు, భక్తులచే ‘కల్కి భగవాన్’గా పూజలందుకున్న విజయ్ కుమార్ నాయుడు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయసురీత్యా వస్తున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (సెప్టెంబర్ 29) రాత్రి కన్నుమూశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారని కల్కి ట్రస్ట్ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు. ఆయన మృతితో దేశవిదేశాల్లోని ఆయన అనుచరులు, భక్తుల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
ఎల్‌ఐసీ ఉద్యోగి నుంచి ఆధ్యాత్మిక గురువుగా తమిళనాడులోని నాతం గ్రామంలో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు.. తన ఆధ్యాత్మిక ప్రయాణానికి ముందు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1980ల చివరి దశలో చిత్తూరు జిల్లాలో ‘జీవాశ్రమ్’ పేరుతో ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా ఆధ్యాత్మిక బోధనల వైపు అడుగులు వేసిన ఆయన.. తను తాను విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి భగవాన్‌గా ప్రకటించుకున్నారు.
తన సతీమణి పద్మావతితో కలిసి ఆయన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బట్టలవల్లిలో ఏకం క్షేత్రం ఆధ్యాత్మిక సముదాయాన్ని స్థాపించారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగానే కాకుండా అమెరికా, ఐరోపా సహా పలు విదేశాల్లోనూ లక్షలాది మంది భక్తులను సంపాదించుకున్నారు. ధ్యానం, దీక్ష ఆశీర్వాదం, మానసిక చైతన్యం వంటి విభిన్న బోధనలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
చెన్నై ఆసుపత్రి నుంచి విజయ్ కుమార్ నాయుడు భౌతిక కాయాన్ని ఆయన సొంత ప్రాంతమైన తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం బట్టలవల్లిలోని ఏకం క్షేత్రానికి తరలిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు, శిష్యులు, ప్రముఖులు సులభంగా తుది నివాళులు అర్పించేందుకు వీలుగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఆయన పార్థివ దేహాన్ని ఆశ్రమంలోనే ఉంచనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు.
కల్కి భగవాన్ భౌతిక కాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పించేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు ఏకం క్షేత్రానికి చేరుకుంటుండటంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.




