ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా సుకన్య సమృద్ధి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చా? కొత్త నిబంధనలు ఇవే

Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ముందుగానే పొదుపు చేయాలనుకుంటారు.

Mokshith
Published on: 15 Nov 2026 6:33 PM IST
Sukanya Samriddhi Yojana
X

ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా సుకన్య సమృద్ధి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చా? కొత్త నిబంధనలు ఇవే

Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ముందుగానే పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మంచి పథకం సుకన్య సమృద్ధి యోజన (SSY). ఈ పథకంలో సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరుతో మాత్రమే ఖాతాలు తెరవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముగ్గురు ఆడపిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం పొందవచ్చని తెలుసా?

ముగ్గురు ఆడపిల్లలకు ఎప్పుడు ఖాతాలు తెరవవచ్చు?

సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరుతో మాత్రమే ఖాతాలు తెరవవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మూడో ఖాతాకు కూడా అనుమతి ఉంటుంది. తల్లికి మొదటి కాన్పులోనే కవల ఆడపిల్లలు లేదా ముగ్గురు ఆడపిల్లలు జన్మిస్తే, నిబంధనల ప్రకారం ముగ్గురి పేరుతో ఖాతాలు తెరవవచ్చు.

మొదటి కాన్పులో ఒక ఆడపిల్ల జన్మించి, రెండో కాన్పులో కవలలు లేదా ముగ్గురు పిల్లలు జన్మించినా ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. అయితే మొదటి కాన్పులోనే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడపిల్లలు జన్మించి, రెండో కాన్పులో మరో ఆడపిల్ల పుడితే మూడో ఖాతాకు అనుమతి ఉండదు. అంటే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనే కారణంతోనే మూడు ఖాతాలు తెరవలేరు. పిల్లలు ఏ కాన్పులో జన్మించారనే అంశం ఆధారంగా అనుమతి లభిస్తుంది.

ఖాతా ఎక్కడ తెరవాలి? పెట్టుబడి పరిమితి ఎంత?

ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పదేళ్ల వయసు వచ్చేలోపు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు. సమీపంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పోస్టాఫీసు లేదా బ్యాంకులో తల్లిదండ్రులు, చట్టబద్ధ సంరక్షకులు ఖాతా ప్రారంభించవచ్చు. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 జమ చేయాలి. ఒక ఖాతాలో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. నిబంధనల ప్రకారం మూడు ఖాతాలు తెరిస్తే, ఒక్కో ఖాతాలో రూ.1.5 లక్షల చొప్పున ఏడాదికి మొత్తం రూ.4.5 లక్షలు జమ చేయవచ్చు. ఈ విధంగా తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్రతి నెలా లేదా వీలున్నప్పుడు డబ్బులు జమ చేయవచ్చు.

మూడో ఖాతా కోసం ఏయే పత్రాలు అవసరం?

ప్రత్యేక మినహాయింపు కింద మూడో ఖాతా తెరవాలనుకునే తల్లిదండ్రులు పిల్లల జనన వివరాలను ధ్రువీకరించే పత్రాలు సమర్పించాలి. ముఖ్యంగా కవలలు లేదా ముగ్గురు పిల్లలు జన్మించినట్లు నిరూపించే జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం. వీటితో పాటు కొన్ని సందర్భాల్లో పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల గుర్తింపు, చిరునామా రుజువులతో పాటు పిల్లల వివరాలతో కూడిన దరఖాస్తు ఫారం. నిబంధనల ప్రకారం అవసరమైన అఫిడవిట్ (స్వీయ ధ్రువీకరణ పత్రం). ప్రత్యేక సందర్భాల్లో వైద్య ధ్రువీకరణ పత్రం. ఖాతా తెరవడానికి వెళ్లే ముందు సంబంధిత పోస్టాఫీసు లేదా బ్యాంకులో అవసరమైన పత్రాల వివరాలు తెలుసుకోవడం మంచిది.

పన్ను మినహాయింపులు.. రూ.2 కోట్లకు పైగా నిధి ఎలా?

సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పాత పన్ను విధానంలో ఏడాదికి రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఈ పథకంలో లభించే వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం కూడా ప్రస్తుత నిబంధనల ప్రకారం పన్ను రహితమే.

ఈ ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది. అయితే మొదటి 15 సంవత్సరాలు మాత్రమే డబ్బులు జమ చేయాలి. ఆ తర్వాత పెట్టుబడి లేకపోయినా ఖాతాలోని మొత్తంపై నిబంధనల ప్రకారం వడ్డీ లభిస్తుంది.

ప్రస్తుతం ఈ పథకానికి 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును ఉదాహరణగా తీసుకుంటే.. ఒక ఖాతాలో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు వరుసగా 15 ఏళ్లు జమ చేస్తే, 21 ఏళ్ల తర్వాత సుమారు రూ.71.82 లక్షలు పొందవచ్చు. ఇదే విధంగా మూడు ఖాతాల్లోనూ గరిష్ఠ పరిమితి మేరకు పెట్టుబడి పెడితే, ముగ్గురు ఆడపిల్లల కోసం కలిపి సుమారు రూ.2.15 కోట్ల నిధి సమకూరే అవకాశం ఉంటుంది. అయితే వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. కాబట్టి చివరికి వచ్చే మొత్తం కూడా మారవచ్చు. ఇది ప్రస్తుత వడ్డీ రేటు ఆధారంగా వేసిన అంచనా మాత్రమే.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.