Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్ గాంధీని నిర్దోషిగా తేల్చిన కోర్టు

Rahul Gandhi: అమిత్ షా పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు భారీ ఊరటనిచ్చింది.

Arun Chilukuri
Published on: 26 Oct 2026 12:18 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్ గాంధీని నిర్దోషిగా తేల్చిన కోర్టు   

Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు కీలక తీర్పును వెలువరించింది.

తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా సుల్తాన్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. వాదనల అనంతరం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసినట్లు రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా మీడియాకు వెల్లడించారు.

కేసు నేపథ్యం – 6 ఏళ్ల న్యాయపోరాటం:

2018 మే 8: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

2018 ఆగస్టు 4: రాహుల్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ బీజేపీ నేత, జిల్లా సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు విజయ్ మిశ్రా సుల్తాన్‌పూర్ కోర్టులో దావా వేశారు.

2023 నవంబర్ 27: సుల్తాన్‌పూర్ ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీకి విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది.

2024 ఫిబ్రవరి 20: రాహుల్ గాంధీ స్వయంగా సుల్తాన్‌పూర్ కోర్టులో హాజరై లొంగిపోగా.. ఆయనకు బెయిల్ మంజూరైంది.

సాక్షుల విచారణ – పిటిషన్ల తిరస్కరణ: విచారణలో భాగంగా రాహుల్ గాంధీ వాయిస్ శాంపిల్స్ మ్యాచింగ్ చేయాలని విజయ్ మిశ్రా చేసిన దరఖాస్తును మేజిస్ట్రేట్ కోర్టు, సెషన్స్ కోర్టులతో పాటు 2026 సెప్టెంబర్ 10న అలహాబాద్ హైకోర్టు కూడా కొట్టివేసింది.

సుదీర్ఘంగా కొనసాగిన విచారణ, ఇరుపక్షాల వాదనలు విన్న సుల్తాన్‌పూర్ ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఆరు సంవత్సరాల కిందటి ఈ పరువు నష్టం కేసు నుంచి రాహుల్ గాంధీని నిర్దోషిగా తేలుస్తూ తుది తీర్పును ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.