Supreme Court: స్కూళ్లలో ర్యాగింగ్, బుల్లీయింగ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Supreme Court: దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ప్రీ-యూనివర్సిటీ విద్యాసంస్థల్లో చిన్న పిల్లల ప్రాణాలను బలిగొంటున్న ర్యాగింగ్, బుల్లీయింగ్ మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా..

Sowmya
Published on: 29 Sept 2026 4:51 PM IST
Supreme Court
X

Supreme Court: స్కూళ్లలో ర్యాగింగ్, బుల్లీయింగ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Supreme Court: దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ప్రీ-యూనివర్సిటీ విద్యాసంస్థల్లో చిన్న పిల్లల ప్రాణాలను బలిగొంటున్న ర్యాగింగ్, బుల్లీయింగ్ మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఒకే కఠినమైన చట్టాన్ని తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. స్కూల్ స్థాయి నుంచే రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న ఈ రకమైన వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా కేంద్ర చట్టం (Central Law) , ఏకరూప మార్గదర్శకాలు (Uniform Guidelines) రూపొందించాల్సిన అవసరం లేదని సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలను జారీ చేసిందని, అవే అంశాలపై పదే పదే కొత్త పిటిషన్లను విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

పిటిషనర్ డిమాండ్లు.. సుప్రీంకోర్టులో దాఖలైన వినతి

యాదవి ఆదిత్య రసివాసియా అనే వ్యక్తి స్కూళ్లలో పెరిగిపోతున్న బుల్లీయింగ్, ర్యాగింగ్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీబీఎస్‌ఈ (CBSE), ఐసీఎస్‌ఈ (ICSE) విద్యాబోర్డులను ప్రతివాదులుగా చేర్చారు.

పాఠశాల స్థాయిలో విద్యార్థులపై జరిగే మానసిక, శారీరక వేధింపులు వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించడానికి నిర్దిష్టమైన కఠిన చట్టం అవసరమని పిటిషనర్ వాదించారు. అంతేకాకుండా, స్కూల్ రోజుల నుంచే పిల్లలకు బుల్లీయింగ్, ర్యాగింగ్ వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలపై అవగాహన కల్పించేలా ఒక ప్రత్యేక సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా పాఠ్యాంశాల్లో (సిలబస్‌లో) చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.

పాత తీర్పులను పునరుద్ఘాటించిన త్రిసభ్య ధర్మాసనం

ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పాఠశాలల్లో ర్యాగింగ్, బుల్లీయింగ్ అరికట్టేందుకు గతంలోనే సుప్రీంకోర్టు సమగ్రమైన మార్గదర్శకాలను ఇచ్చిందని ధర్మాసనం గుర్తుచేసింది.

ఒకే అంశంపై మళ్లీ మళ్లీ పిటిషన్లు వేస్తూ వస్తే వాటిని ఎంటర్‌టైన్ చేయడం కుదరదని కుండబద్దలు కొట్టింది. ఇప్పటికే ఇచ్చిన జడ్జిమెంట్లు, డైరెక్షన్లు పర్ఫెక్ట్‌గా అమలు జరిగేలా చూసుకోవడానికి అవసరమైతే సంబంధిత ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం (Representation) సమర్పించుకోవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాదికి అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

ప్రభుత్వాలు, స్కూల్ యాజమాన్యాలదే బాధ్యత

విద్యార్థుల భద్రత, రక్షణ బాధ్యతను చూడాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయా పాఠశాలల యాజమాన్యాలపైనే పక్కాగా ఉందని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలు కాకుండా ప్రత్యేకంగా మరొక సెంట్రల్ లా తీసుకురావాలంటూ వేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి ధర్మాసనం సున్నితంగా నిరాకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

కొత్త చట్టాల రూపకల్పన కంటే ముందే ఉన్న నియమ నిబంధనలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడమే అత్యంత కీలకమని ఈ సందర్భంగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sowmya

Sowmya