Supreme Court: భార్యాభర్తల బంధంలో నమ్మకం సన్నగిల్లుతోంది.. హనీమూన్ హత్యలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
Supreme Court: హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
Supreme Court: భార్యాభర్తల బంధంలో నమ్మకం సన్నగిల్లుతోంది.. హనీమూన్ హత్యలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
Supreme Court: సమాజంలో వస్తున్న మార్పుల కారణంగానే ఇటీవల కాలంలో ‘హనీమూన్ హత్య’ లాంటి దారుణ కేసులు వెలుగుచూస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నేటి తరానికి జ్ఞానం పెరుగుతున్నప్పటికీ.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని, అందుకే వారు మరింత బలహీనంగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ బెయిల్ అంశంపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
హనీమూన్‌లో భర్త రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్‌ను రద్దు చేసింది. ఆమె రాబోయే మూడు వారాల్లోగా లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలె ధర్మాసనం చేపట్టింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం సమాజంలోని ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "మారుతున్న సమాజంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. నేటి తరానికి ఓపిక తక్కువ, చికాకు ఎక్కువ. వారు సమస్యలకు తక్షణ పరిష్కారాలను కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంటోంది.. అందులో షేర్ అవుతున్న వాటిని నమ్మి దాన్నే జ్ఞానం అనుకుంటున్నారు" అని ధర్మాసనం పేర్కొంది.
మేఘాలయ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. "ఈ మధ్య హనీమూన్‌కు వెళ్తోన్న భర్తలు బాడీగార్డులను వెంట తీసుకెళ్తున్న కామెడీ రీల్స్ వస్తున్నాయి. భార్యాభర్తల బంధంలో ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం క్రమంగా క్షీణిస్తోంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఇలాంటి సమస్యలను మెరుగ్గా పరిష్కరించేవి" అని తెలిపారు.
సొలిసిటర్ జనరల్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తుచేసింది. "ఉమ్మడి కుటుంబంలో పెరిగినప్పుడు పెద్దవాళ్లను చూసి పిల్లలు సర్దుకుపోయే మనస్తత్వాన్ని నేర్చుకోగలుగుతారు. నిరాశను ఎలా జయించాలో తెలుస్తుంది. కానీ, నేడు అన్నీ చిన్న కుటుంబాలే. అలాంటి వాతావరణంలో పెరిగిన వారు చిన్న చిన్న వాటికి కూడా కుంగిపోతున్నారు. నచ్చినది దొరక్కపోతే విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య ఓ హోటల్‌లో చిన్నారి ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చి ఊరుకోబెట్టారు. భావోద్వేగాలను నియంత్రించాల్సిన సమయంలో గ్యాడ్జెట్లతో సర్దిచెప్పడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది" అని ధర్మాసనం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.




