డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. బ్యాంకులదే బాధ్యతా?
Supreme Court Digital Fraud: దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. బ్యాంకులదే బాధ్యతా?
Supreme Court digital fraud: దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఫ్రాడ్ బాధితులను రక్షించాల్సిన బాధ్యత పూర్తిగా బ్యాంకులదేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్యాంకుల నిర్లక్ష్యం లేదా డ్యూ డిలిజెన్స్ (సమర్థవంతమైన తనిఖీలు) లోపించడం వల్లే మోసాలు జరిగితే, బాధితులు కోల్పోయిన మొత్తాన్ని బ్యాంకులే చెల్లించాలని తేల్చిచెప్పింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
బ్యాంకులదే పూర్తి బాధ్యత.. నిఘా పెంచాల్సిందే
అకౌంట్ హోల్డర్ సాధారణ లావాదేవీలకు విరుద్ధంగా జరిగే అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు వెంటనే గుర్తించి నిలిపివేయాలని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా రూ.10 వేల నుంచి రూ.20 వేలు డ్రా చేసే వ్యక్తి ఖాతా నుంచి అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయితే వాటిని ఎందుకు గుర్తించలేకపోతున్నారని బ్యాంకులను ప్రశి్నంచింది. ఖాతాదారులను మోసాల నుంచి రక్షించడం బ్యాంకుల కర్తవ్యమని, దీనిపై సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరిగితే బ్యాంకులు పరిహారం చెల్లించడంతో పాటు ప్రాసిక్యూషన్‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీం ఆగ్రహం
దేశంలో డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై కోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. చదువుకున్న వారు సైతం ఇలాంటి ఫ్రాడ్స్‌లో ఎలా చిక్కుకుంటున్నారని, మొబైల్‌లో ఎవరో ఫోన్ చేసి అరెస్ట్ చేశామంటే ఎలా భయపడిపోతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు జోక్యం, ప్రభుత్వ చర్యలు, అవగాహన కార్యక్రమాల వల్ల దేశంలో డిజిటల్ అరెస్ట్ కేసులు దాదాపు 50 శాతం తగ్గాయని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు రూ. 800 కోట్ల మేర ప్రజలు నష్టపోయారని సీజేఐ గుర్తుచేశారు.
ముల్ అకౌంట్లపై కఠిన చర్యలు
సైబర్ నేరాలకు నిధులు బదిలీ చేయడానికి వాడుతున్న 'ముల్ అకౌంట్లు' (Mule accounts), బ్యాంకుల బాధ్యతలపై కోర్టు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆర్‌బీఐ ప్రవేశపెట్టనున్న కొత్త కేవైసీ సవరణ మార్గదర్శకాలను (KYC Amendment Directions, 2026) పరిశీలిస్తామని తెలిపింది. ఆమోదిత ఆర్థిక సంస్థల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్‌ను ఆదేశించింది. బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే అన్ని సంస్థలకు వర్తించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.




