Supreme Court: ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే కరెంట్ కట్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!
Supreme Court: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే కరెంట్ కట్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!
Supreme Court: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత కోసం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇప్పటివరకు ఈ-చలాన్ల రూపంలో విధించిన జరిమానాల్లో ఇంకా రూ.20 వేల కోట్లు వసూలు కావాల్సి ఉందని గుర్తు చేస్తూ.. బకాయిల వసూలుకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై 2012లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)పై జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలక్ట్రానిక్ మానిటరింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూ.45 వేల కోట్ల విలువైన చలానాలు జారీ చేయగా, కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిల వసూలుకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి జారీ అయిన ఈ-చలాన్ల బకాయిలను నెలవారీ విద్యుత్ బిల్లుల్లో చేర్చి వసూలు చేయాలని ఆదేశించింది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు కాబట్టి, జరిమానాలు కచ్చితంగా వసూలవుతాయని అభిప్రాయపడింది.
ఈ-చలానా బకాయిలు చెల్లించని వాహనాలకు ఆన్లైన్ సేవలను పూర్తిగా నిలిపివేయాలి. ఆర్సీల పునరుద్ధరణ (RC Renewal), డూప్లికేట్ ఆర్సీల జారీ, యజమాని చిరునామా అప్డేషన్ వంటి సేవలను నిషేధించడంతో పాటు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయకూడదు. అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకోవాలి.
ఎక్కువసార్లు నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు రెన్యువల్‌ను నిరాకరించాలి.
మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల అమలు కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తీసుకోబోయే చర్యలపై నిర్దిష్ట గడువుతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
నిబంధనలు సరిగా అమలు చేయని అధికారులపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో అమికస్ క్యూరీ సమర్పించే నివేదిక అత్యంత కీలకమని జస్టిస్ పార్దీవాలా పేర్కొన్నారు.




