Supreme Court: నీట్-యూజీ పేపర్ లీక్‌పై ఆగ్రహం.. కేంద్రం, ఎన్‌టీఏలకు సుప్రీం నోటీసులు!
Supreme Court: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పదే పదే తప్పులు జరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం, ఎన్‌టీఏలకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు అసహనాన్ని వ్యక్తపరిచింది.
Supreme Court: నీట్-యూజీ పేపర్ లీక్‌పై ఆగ్రహం.. కేంద్రం, ఎన్‌టీఏలకు సుప్రీం నోటీసులు!
Supreme Court: లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే 'నీట్' ప్రవేశ పరీక్ష చుట్టూ ఉన్న వివాదాలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు.. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో తాము ఎన్నో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, పర్యవేక్షణ కోసం రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసినా.. మళ్లీ ఇలాంటి తప్పిదాలే పునరావృతం కావడం నిజంగా విచారకరం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తప్పుల నుంచి వ్యవస్థలు ఇంకా పాఠాలు నేర్చుకోకపోవడంపై కోర్టు అసహనాన్ని వ్యక్తపరిచింది. ఈ లీకేజీ వ్యవహారంపై మూడు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్‌టీఏను ఆదేశించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. అలాగే మాజీ ఇస్రో శాస్త్రవేత్త, మానిటరింగ్ కమిటీ హెడ్ రాధాకృష్ణన్‌ను కూడా అఫిడివేట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో భారీగా అక్రమాలు, లీకేజీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో.. పరీక్ష జరిగిన రెండు రోజులకే దానిని రద్దు చేశారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు దొంగలను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేసింది. పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన అర్హులైన విద్యార్థుల కోసం జూన్ 21న తిరిగి నీట్ రీ-ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు.




