Supreme Court: ఆందోళన చేస్తే లాఠీ ఛార్జ్ చేస్తారా?: పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

Supreme Court: ఢిల్లీ విద్యార్థుల నిరసనలపై పోలీసుల లాఠీఛార్జీని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.

Arun Chilukuri
Updated on: 27 July 2026 1:29 PM IST
Supreme Court
X

Supreme Court: ఆందోళన చేస్తే లాఠీ ఛార్జ్ చేస్తారా?: పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

Supreme Court: ఢిల్లీలో ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్రంగా తప్పుబట్టింది. రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసనలు తెలిపే ప్రాథమిక హక్కు దేశ పౌరులకు ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.

జూలై 20న విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసుల తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానిస్తూ — "కేవలం నిరసనలు తెలుపుతున్నారనే కారణంతో విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం చేయడం, లాఠీఛార్జీకి దిగడం ఎంతమాత్రం సరైన చర్య కాదు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించేటప్పుడు పోలీసుల ప్రవర్తన, చర్యలపై దేశవ్యాప్తంగా ఏకరూప మార్గదర్శకాలు అవసరం" అని అభిప్రాయపడ్డారు.

మరోవైపు విచారణ సందర్భంగా ఆందోళనల్లో చొరబడిన ఆకతాయిలు లేదా విద్రోహ శక్తులు పోలీసులపై దాడులకు తెగబడటం పట్ల జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల ముసుగులో హింసను ప్రేరేపించే వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిపై కూడా దాడులు జరిగాయని ఓ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. "ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమైనదే. నిరసనకారులు హింసకు తావు లేకుండా స్వీయ క్రమశిక్షణ పాటించాలి" అని సూచించారు.

పోలీసుల అతిక్రమణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీ, బాడీ-కెమెరా రికార్డింగ్‌ల వంటి కీలక ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను తక్షణమే భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని, గాయపడిన నిరసనకారులకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story