Justice Ujjal Bhuyan: న్యాయ పండితులను విస్మరించడం సరికాదు.. సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు!
Justice Ujjal Bhuyan: రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నప్పటికీ గత 76 ఏళ్లుగా ఒక్క విద్యావేత్తను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించకపోవడం శోచనీయమని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు.
Justice Ujjal Bhuyan: న్యాయ పండితులను విస్మరించడం సరికాదు.. సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు!
Justice Ujjal Bhuyan: భారత రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, గత 76 ఏళ్లలో న్యాయశాస్త్రంలో అపారమైన పరిజ్ఞానం కలిగిన ఒక్క విద్యావేత్తను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించకపోవడం అత్యంత శోచనీయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
"న్యాయశాస్త్రంపై లోతైన అవగాహన ఉన్న పండితులను న్యాయమూర్తులుగా నియమిస్తే సుప్రీంకోర్టు మరింత వైవిధ్యభరితంగా మారుతుంది. తద్వారా న్యాయనిర్ణయ ప్రక్రియ మరింత బలోపేతం అవుతుంది."
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(3)(సి) ప్రకారం నిపుణులైన న్యాయ విద్యావేత్తలను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి స్పష్టమైన అవకాశం ఉందని ఆయన గుర్తుచేశారు.
దశాబ్దాలుగా కేవలం హైకోర్టు న్యాయమూర్తులు లేదా బార్‌లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులనే సుప్రీంకోర్టుకు ఎంపిక చేస్తున్నారని, అప్పుడప్పుడు బార్ నుంచి నేరుగా నియామకాలు జరిగినా స్వచ్ఛమైన న్యాయ విద్యావేత్తలను ఎన్నడూ పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యావేత్తలకు క్షేత్రస్థాయి అనుభవం ఉండదనే వాదనలో ఎలాంటి పదును లేదని, ప్రపంచంలోని అనేక దేశాలు తమ రాజ్యాంగ న్యాయస్థానాలకు న్యాయ పండితులను క్రమం తప్పకుండా నియమిస్తున్నాయని ఉదహరించారు.
ఇదే కార్యక్రమంలో విద్యార్థుల భావప్రకటన స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తూ.. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినందుకు విద్యార్థులను బెదిరించడం లేదా కఠిన చర్యలు తీసుకోవడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛా ఆలోచనలను ప్రోత్సహించే వేదికలుగా ఉండాలని, ప్రశ్నించడాన్ని తిరుగుబాటుగా చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని హితవు పలికారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




