Supreme Court : 34 నుంచి 38కి పెంపు... సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్

Supreme Court :సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

CR Reddy
Published on: 17 May 2026 10:25 AM IST
Supreme Court
X

Supreme Court

Supreme Court : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల కొరతకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో చీఫ్ జస్టిస్‌తో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి చేరుకుంది. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని న్యాయ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఆదివారం (మే 17, 2026) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్-2026కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు. దీని ప్రకారం.. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి జడ్జీల సంఖ్య 33 నుంచి 37కి పెరిగింది. సీజేఐతో కలిపి మొత్తం 38 మంది న్యాయమూర్తులు ఇకపై సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తించనున్నారు. 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి ఈ మేరకు సవరణలు చేశారు.

ఏడేళ్ల తర్వాత మళ్ళీ పెంపు

చివరిసారిగా 2019లో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 30 నుంచి 34కి పెంచారు. అయితే గత కొన్నేళ్లుగా దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సుమారు 95 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్క్ లోడ్ పెరగడం వల్ల సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందని న్యాయవాదులు, బార్ అసోసియేషన్లు సుదీర్ఘకాలంగా జడ్జీల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ మే 5న ఈ ప్రతిపాదనను సిద్ధం చేయగా, తాజాగా రాష్ట్రపతి దానికి ఓకే చెప్పారు.

న్యాయవాదుల హర్షం.. భవిష్యత్తులో 50 దాకా

ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ స్వాగతించారు. సుప్రీంకోర్టు కొత్త భవనంలోని ఒక భాగం ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని, అదనపు జడ్జీలకు అక్కడ వసతి కల్పించడం సులభమవుతుందని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో కేసుల పరిష్కార వేగం పెరగాలంటే జడ్జీల సంఖ్య 50కి చేరాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం సంఖ్య పెంచడమే కాకుండా, టెక్నాలజీని వాడుతూ కేస్ మేనేజ్‌మెంట్‌లో కూడా సంస్కరణలు తేవాలని పలువురు సీనియర్ న్యాయవాదులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story