బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. కర్ణాటక సర్కార్‌కు షాక్
Karnataka Bike: బైక్ ట్యాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను..
బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. కర్ణాటక సర్కార్‌కు షాక్
Karnataka Bike: కర్ణాటక రోడ్లపై బైక్ ట్యాక్సీలు మళ్లీ పరుగులు తీసేందుకు మార్గం సుగమమైంది. బైక్ ట్యాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం.. జనవరి 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ, వాటిని పూర్తిగా నిషేధించడం కంటే నిబంధనలతో క్రమబద్ధీకరించడమే ఉత్తమమని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో కర్ణాటక వ్యాప్తంగా యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ సేవలు యథావిధిగా కొనసాగేందుకు లైన్ క్లియర్ అయింది.
ఆటో కంటే ఐదు రెట్లు తక్కువ.. జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
తీర్పు సందర్భంగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ తన ఆఫీసులో పనిచేసే మహిళలతో జరిగిన ఒక సంభాషణను న్యాయవాదుల ముందు ప్రస్తావించారు. ఆఫీసుకు ఎలా వస్తున్నారని అడిగితే, క్యాబ్ ఖర్చు భరించలేక బైక్ ట్యాక్సీలో వస్తున్నామని చెప్పారని వివరించారు. ఆటో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా, ఆటో ఛార్జీ ఐదు రెట్లు ఎక్కువగా ఉందని వారు బదులిచ్చారని తెలిపారు. జీపీఎస్ సదుపాయం ఉండే బైక్ ట్యాక్సీలు యువతులకు సురక్షితమేనని, దేశంలోని 25 రాష్ట్రాల్లో ఇప్పటికే ఇవి నడుస్తున్నాయని గుర్తుచేశారు. కార్లతో పోలిస్తే బైక్‌లు రోడ్డుపై తక్కువ స్థలం తీసుకుంటాయని, ట్రాఫిక్ రద్దీపై ప్రభుత్వం చెబుతున్న కారణాలపై ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రభుత్వ వాదనలు.. అగ్రిగేటర్ల కౌంటర్
మోటారు వాహనాల చట్టం కింద బైక్‌లు, క్యాబ్‌లకు వేర్వేరు నిర్వచనాలు ఉన్నాయని, తమ నిబంధనల్లో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేదని కర్ణాటక ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. భద్రత, రద్దీ, కాలుష్యంపై 2019 నిపుణుల కమిటీ నివేదికను ప్రస్తావిస్తూ, బెంగళూరు మినహా మిగతా చోట్ల పరిశీలిస్తామని తెలిపారు. మరోవైపు కర్ణాటకలో దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులు వీటి వల్ల లబ్ధి పొందుతున్నారని బైక్ ట్యాక్సీ సంస్థలు కోర్టుకు తెలిపాయి. 2004, 2024 నాటి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు బైక్‌లను ట్యాక్సీలుగా వాడుకునేందుకు అనుమతిస్తున్నాయని పేర్కొన్నాయి. ఆటో, ట్యాక్సీ సంఘాలు మాత్రం నిబంధనల వ్యత్యాసంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
నిషేధం నుంచి అనుమతి వరకు ఇలా సాగింది
గత ఏడాది జూన్ 16న కర్ణాటక ప్రభుత్వం యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. దీనిపై ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు వేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఏడాది జనవరి 23న నిషేధాన్ని ఎత్తివేస్తూ బైక్‌లను రవాణా వాహనాలుగా నమోదు చేసి క్యారేజ్ పర్మిట్లు ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించడంతో హైకోర్టు ఆదేశాలే అమల్లో ఉంటాయి.




