CBSE: తొమ్మిదో తరగతిలో కొత్త భాష వద్దు.. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది: సుప్రీంకోర్టు!
CBSE: సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో మూడో భాష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తొమ్మిదో తరగతిలో కొత్త భాష వద్దు.. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది: సుప్రీంకోర్టు!
Supreme Court: సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో భాగంగా మూడో భాష అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులపై అదనపు భారం పడకుండా ఉండేలా విద్యా విధానంలో మార్పులు ఉండాలని అభిప్రాయపడింది. ముఖ్యంగా, తొమ్మిదో తరగతిలో అకస్మాత్తుగా కొత్త భాషను ప్రవేశపెట్టడం ఏమాత్రం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తొమ్మిదో తరగతిలో కొత్త భాషను తీసుకురావడం వల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని కోర్టు పేర్కొంది. దీనికి బదులుగా.. ఏదైనా కొత్త భాషను నేర్పించాలనుకుంటే ప్రాథమిక స్థాయిలోనే, అంటే ఐదు లేదా ఆరో తరగతిలోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది.
తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల (JNV) ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం త్రిభాషా విధానంపై ఈ వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా జేఎన్‌వీల్లో త్రిభాషా విధానం అమలవుతున్నప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమ రాష్ట్రంలో వీటి ఏర్పాటుకు నిరాకరిస్తోంది.
అయితే, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జేఎన్‌వీ ఏర్పాటు చేయడాన్ని సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వగా, దీనిని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా త్రిభాషా విధానం అంశం తెరపైకి వచ్చింది. కాగా, సీబీఎస్‌ఈలో త్రిభాషా విధానం అమలుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ముందు ఇప్పటికే విచారణ కొనసాగుతోంది.




