Supreme Court: ఓటర్ లిస్ట్‌లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం పోదు!

Supreme Court: ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Arun Chilukuri
Published on: 17 July 2026 5:01 PM IST
Supreme Court
X

Supreme Court: ఓటర్ లిస్ట్‌లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం పోదు!

Supreme Court: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియ మరియు దాని పర్యవసానాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో ఒక వ్యక్తి పేరు తొలగించినంత మాత్రాన వారు దేశ పౌరసత్వాన్ని కోల్పోయినట్లు కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్‌లో 'సర్‌' (SIR) ప్రక్రియపై తలెత్తిన తీవ్ర అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ కేంద్రంగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది.

అసలు వివాదం ఏంటి?

బెంగాల్‌లో జరుగుతున్న 'సర్‌' (SIR) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా నుంచి పేర్లు కోల్పోయిన లక్షలాది మంది బాధితుల తరఫున ప్రసేన్‌జిత్‌ బోస్‌ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఓటరు జాబితాలో పేరు తొలగించిన వెంటనే.. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఇచ్చే రేషన్, అన్నపూర్ణ పథకం, ఆర్థిక సాయం వంటి అత్యవసర సంక్షేమ పథకాల ప్రయోజనాలను బెంగాల్ ప్రభుత్వం నిలిపివేస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఓటర్ లిస్ట్ నుంచి తొలగింపునకు గురైన వారి విన్నపాలను పరిష్కరించే ప్రత్యేక ట్రైబ్యునళ్ల ముందు ప్రస్తుతం దాదాపు 34 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని.. ఇప్పటివరకు కేవలం 38 వేల కేసులను మాత్రమే పరిష్కరించారని, ఈ లోపు పేదలకు సంక్షేమ పథకాలు నిలిపివేయడం అన్యాయమని పిటిషనర్ వాదించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. గతంలో బిహార్ 'సర్‌' కేసులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేసింది. "ఎన్నికల సంఘానికి కేవలం ఓటరు జాబితాలను సిద్ధం చేయడం, వాటిని పర్యవేక్షించే అధికారం మాత్రమే ఉంటుంది. ఎవరి పౌరసత్వాన్ని నిర్ణయించే హక్కు ఈసీకి లేదు. పౌరసత్వంపై అనుమానంతో ఎవరినైనా ఓటరు జాబితా నుంచి తొలగిస్తే.. వారి పౌరసత్వ హోదాను నిరూపించుకునే ప్రక్రియ కోసం ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘంపైనే ఉంటుంది."

ఓటరు జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను నిరాకరించవచ్చా? లేదా? అనే రాజ్యాంగపరమైన అంశాన్ని తాము లోతుగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పిటిషన్‌ను జులై 25 లోపే విచారణకు లిస్ట్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story