CBSE: సీబీఎస్ఈ 6వ తరగతి త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
CBSE: సీబీఎస్ఈ పరిధిలోని 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి మూడవ భాషా విధానం నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది.
CBSE: సీబీఎస్ఈ 6వ తరగతి త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court: పాఠశాల విద్యార్థులపై ఆకస్మికంగా రుద్దబడే నిబంధనల వల్ల వారు పడే మానసిక ఇబ్బందులను సుప్రీంకోర్టు సున్నితంగా అర్ధం చేసుకుంది. సీబీఎస్ఈ పరిధిలోని 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి మూడవ భాషా విధానం నుండి మినహాయింపు ఇస్తూ అత్యున్నత ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ వెసులుబాటును, ప్రస్తుత 6వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ స్పష్టం చేసింది. ఈ సరికొత్త విధానాన్ని 2027 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కోర్టు పేర్కొంది.
ఆకస్మికంగా భాషా విధానాన్ని మార్చడం వల్ల విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు భౌతికంగా అందుబాటులో లేవని, కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉండటం విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఉదాహరణకు, డీపీఎస్ వంటి పాఠశాలల్లో విద్యార్థులు 4వ తరగతి నుంచే స్పానిష్ లాంటి భాషలను అభ్యసిస్తుంటే, సడన్గా వారిని సంస్కృతం లాంటి ఇతర భాషలకు మార్చడం వల్ల వారు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.పిల్లల తెలివితేటలపై మాకు ఎలాంటి సందేహం లేదు, వారు ఎలాంటి సవాలనైనా ఎదుర్కోగలరు" అని కేంద్రం వాదించినప్పటికీ... కోర్టు మాత్రం విద్యార్థులకు ఇబ్బందులు లేదా కష్టాలు రాకూడదు, వారికి తగిన సౌకర్యం ముఖ్యమని తేల్చిచెప్పింది.
దాదాపు 99 శాతం సీబీఎస్ఈ పాఠశాలలు తృతీయ భాషా విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయని, కేవలం 1.2 శాతం (సుమారు 2,800) పాఠశాలలు మాత్రమే దీనివల్ల ప్రభావితమయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది నుంచే దీనిని కొనసాగించాలని కోరారు. ఏది ఏమైనప్పటికీ, విద్యార్థులకు అనవసరమైన సవాళ్లు, ఇబ్బందులు సృష్టించడం సరికాదన్న ఉద్దేశంతో... 7వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన మినహాయింపునే ప్రస్తుత 6వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ వివాదానికి సంబంధించి తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్, ఆ తర్వాత రెండు వారాల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని ఇరువర్గాలను ఆదేశించింది.




