Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాహుల్ గాంధీకి ఊరట

Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 17 Aug 2026 4:18 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాహుల్ గాంధీకి ఊరట

Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో తదుపరి విచారణ నివేదికలను అలహాబాద్ హైకోర్టుకు సమర్పించవద్దని దర్యాప్తు సంస్థలైన ఈడీ (ED), సీబీఐ (CBI)లను సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అలాగే, ఆగస్టు 20న అలహాబాద్ హైకోర్టులో జరగాల్సిన విచారణను నిలిపివేయాలని (స్టే) ఆదేశాలు జారీ చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం దర్యాప్తు సంస్థల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. "ఈ విషయం అంత తీవ్రమైనదైతే.. ఇన్నాళ్లూ దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనం వహించాయి? సుమోటోగా చర్యలు ఎందుకు తీసుకోలేదు?" అని ప్రశ్నించింది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఎలా ఆదేశాలు ఇస్తారని వ్యాఖ్యానించింది.

రాహుల్ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కర్ణాటకకు చెందిన బిజెపి నేత విఘ్నేష్ శిశిర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈడీ, సీబీఐలను హైకోర్టు ఆదేశించింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను అలహాబాద్ హైకోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అలహాబాద్ హైకోర్టులోని విచారణను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story