Supreme Court: రోడ్లను శాశ్వతంగా ఆక్రమిస్తామంటే ఎలా?: నిరసనకారులకు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్!

Supreme Court: దిల్లీలో నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. నిరసనల పేరిట ఏ ప్రాంతాన్ని నిరవధికంగా ఆక్రమించడం వీలుకాదన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.

Arun Chilukuri
Published on: 3 Nov 2026 3:07 PM IST
Supreme Court
X

Supreme Court: రోడ్లను శాశ్వతంగా ఆక్రమిస్తామంటే ఎలా?: నిరసనకారులకు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్!

Supreme Court: దేశ రాజధాని దిల్లీలో పండగల సీజన్‌లో విపక్షాలు, వివిధ సంఘాల నిరసనల వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, నిరసనల పేరిట ఎవరూ కూడా ఏ ప్రాంతాన్ని లేదా రహదారులను నిరవధికంగా ఆక్రమించుకోవడం వీలుకాదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆందోళనల కోసం కేటాయించిన అధికారిక ప్రదేశాలకూ కూడా ఒక సమయ పరిమితి ఉండాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజా నిరసనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, నిరసనకారులు ఏ ప్రాంతాన్ని శాశ్వతంగా తమ అధీనంలో ఉంచుకోలేరని పేర్కొన్నారు. ఇదే సమయంలో రైతులు, న్యాయవాదులు సహా సమాజంలోని ఇతర వర్గాలు కూడా వేర్వేరు అంశాలపై నిరసనలు తెలుపుతున్నారని, ప్రతి ఒక్కరికీ రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందనే విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.

విచారణలో ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, నిరసనలకు పిలుపునిచ్చేవారే తదనంతరం జరిగే పరిణామాలకు పూర్తిగా బాధ్యత వహించాలని కోరారు. జులై 20న చేపట్టిన నిరసనకు ప్రభుత్వం కేవలం ఒక్కరోజుకే అనుమతి ఇచ్చినప్పటికీ, నిరసనకారులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు వ్యాపార సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, దేశ రాజధానిలో వరుస నిరసనల వల్ల వాణిజ్య కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, వ్యాపారులు భారీగా నష్టపోతున్నారని తెలిపారు. రాబోయే పండగల సీజన్‌ను పరిగణనలోకి తీసుకుని రాబోయే రెండు నెలల పాటు దిల్లీలో నిరసనలపై ఆంక్షలు విధించాలని కోరారు. ఈ సుదీర్ఘ వాదనలను విన్న సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత వర్గాలన్నింటికీ అత్యవసర నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.