SC Status : మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. సుప్రీం మరోసారి క్లారిటీ..
supreme court
SC Status : మతం మారిన వ్యక్తులకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా లభించే షెడ్యూల్డ్ కులాల (SC) హోదాపై అత్యున్నత న్యాయస్థానం తన చారిత్రాత్మక వైఖరిని మరోసారి గట్టిగా వినిపించింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను విడిచిపెట్టి క్రైస్తవంలోకి లేదా ఇతర మతాల్లోకి మారిన ఏ వ్యక్తైనా సరే, వారు పొందుతున్న ఎస్సీ హోదాను తక్షణమే కోల్పోతారని సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 2026లో ఈ వ్యవహారంపై తామిచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం.. పాత తీర్పులో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెబుతూ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
రీ-కన్వర్షన్ ఐతే ఓకే.. కానీ కఠిన నిబంధనలు..
ఒకసారి వేరే మతంలోకి మారినంత మాత్రాన శాశ్వతంగా ఎస్సీ హోదా దక్కకుండా పోదని, వారు తిరిగి మాతృ మతంలోకి వస్తే హోదా పునరుద్ధరణ సాధ్యమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాకపోతే, ఈ పునర్మార్పిడి ప్రాసెస్ సులువుగా సాగకుండా మూడు ప్రధాన షరతులను తప్పనిసరి చేసింది. మొదటగా సదరు వ్యక్తి పుట్టుకతోనే గుర్తింపు పొందిన ఎస్సీ కులానికి చెందినవాడై ఉండాలి. రెండవది, స్వీకరించిన పరమతాన్ని వదిలిపెట్టి పూర్తి విశ్వాసంతో తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి అడుగుపెట్టాలి. చివరిగా, ఆ వ్యక్తి తిరిగొచ్చినప్పుడు అతడి సొంత కుల పెద్దలు, సమాజం అతడిని తమ కుల సభ్యుడిగా ఆమోదిస్తూ అంగీకారం తెలపాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క షరతు తప్పినా ఎస్సీ హోదా దక్కదు.
ఏపీ హైకోర్టు తీర్పుకే సుప్రీం జై..
ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్‌గా మారిన ఒక వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ చట్టపరమైన చిక్కుముడి ఏర్పడింది. క్రైస్తవం స్వీకరించిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, అందువల్ల అట్రాసిటీ కేసు చెల్లదని ఏపీ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడమే కాకుండా, ఇప్పుడు దానిపై వచ్చిన పునఃసమీక్షా పిటిషన్‌ను కూడా కొట్టివేయడంతో.. మతం మారిన వారికి ఎస్సీ హోదా, అట్రాసిటీ చట్ట రక్షణలు లభించవనే అంశంపై స్పష్టత వచ్చింది.




