Gyanesh Kumar: ఎన్నికల కమిషనర్ను శిక్షించలేరా? సీఈసీ చట్టంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
Gyanesh Kumar: ఎన్నికల సంఘం నియామకాలు, సేవా షరతులకు సంబంధించిన 2023 చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాగ విరుద్ధమని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Gyanesh Kumar
Gyanesh Kumar: భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ అధికారిక విధుల్లో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు లేదా చేసే చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉన్న రక్షణ చట్టంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఎన్నికల సంఘం నియామకాలు, సేవా షరతులకు సంబంధించిన 2023 చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాగ విరుద్ధమని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2023 చట్టంలోని సెక్షన్ 16 పై సుప్రీంకోర్టు ఆగ్రహం
నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తరఫున సుప్రీంకోర్టులో ఈ తాజా పిటిషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాలా బాగ్చి, జస్టిస్ వి మోహనా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా షరతులు, పదవీకాలం) చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం.. సీఈసీ లేదా ఎన్నికల కమిషనర్లుగా పనిచేస్తున్నవారు లేదా పనిచేసి రిటైర్ అయినవారు తమ విధులను నిర్వర్తించే సమయంలో చేసిన పనులకు సంబంధించి ఏ కోర్టు కూడా సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తోంది. ఈ పూర్తి మినహాయింపు నిబంధనను సవాల్ చేస్తూ కోర్టులో సవాళ్లు ఎదురవుతున్నాయి.
జీవితాంతం రక్షణ కల్పించడం సరైనదేనా?
ఈ చట్టపరమైన నిబంధన సీఈసీ, ఇతర కమిషనర్లకు అపరిమితమైన అధికారాలను ఇస్తోందని, పదవిలో ఉన్నప్పుడు జరిగే తప్పులు లేదా దుర్వినియోగాలపై ఎలాంటి విచారణ లేకుండా జీవితాంతం రక్షణ కల్పిస్తోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా లోక్ ప్రహరి అనే సంస్థ ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో కోర్టు ఈ నిబంధనను నిలిపివేయడానికి నిరాకరించినప్పటికీ విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఇప్పుడు అదే తరహాలో ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా గతంలో ఉన్న మరో పెండింగ్ కేసుతో జతచేస్తూ విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘం పనితీరుకు వ్యతిరేకంగా నిరసనల హోరు కొనసాగుతోంది. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తూ ఆందోళనలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష నేతలు నినాదాలు చేస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభం మధ్యలో సుప్రీంకోర్టు చేపట్టబోయే విచారణ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనుంది.
ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడే దిశగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి చట్టపరమైన రక్షణలు ఎంతవరకు అవసరమనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు భవిష్యత్తులో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.




