Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!

Rahul Gandhi: ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 25 Nov 2026 5:22 PM IST
Rahul Gandhi
X

 Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ లతో విచారణ జరిపించాలంటూ అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం పక్కనపెట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ, ఈ వ్యవహారాన్ని తాజాగా పరిశీలించాలని ఆదేశించింది.

కర్ణాటకకు చెందిన విఘ్నేశ్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపిన సుప్రీం ధర్మాసనం, కొత్త బెంచ్ ముందు ఈ అంశాన్ని తాజాగా విచారించాలని సూచించింది. ఈ పిటిషన్ విచారణకు అర్హమా? కాదా? అనే అంశాన్ని ముందుగా పరిశీలించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది.

గతంలో రాహుల్ గాంధీ వాదనలు వినకుండానే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తించిన ధర్మాసనం, ఆయనను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చి, ఆయన వాదనలు విన్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.

అసలేం జరిగింది?

రాహుల్ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన విఘ్నేశ్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు గతంలో సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అయితే, హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

గతంలోనే హైకోర్టు చర్యలపై మధ్యంతర స్టే విధించిన సుప్రీంకోర్టు, ఎటువంటి నివేదికలు దాఖలు చేయవద్దని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. తాజాగా తుది విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం, హైకోర్టు ఆదేశాలన్నింటినీ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా, రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ విఘ్నేశ్ దాఖలు చేసిన మరో పిటిషన్ అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.