Supreme Court: సుప్రీం కోర్టులో పిటిషనర్ హల్చల్.. జడ్జిల ముందే పేపర్లు గాల్లోకి విసిరేసి రభస!
Supreme Court: సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా ఓ పిటిషనర్ ఊహించని విధంగా రెచ్చిపోయాడు. జడ్జిల ముందే కేసు పేపర్లు గాల్లోకి విసిరేసి హల్‌చల్ చేశాడు.
Supreme Court: సుప్రీం కోర్టులో పిటిషనర్ హల్చల్.. జడ్జిల ముందే పేపర్లు గాల్లోకి విసిరేసి రభస!
Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో శుక్రవారం నాడు తీవ్ర కలకలం రేగింది. నిత్యం అత్యంత కఠినమైన భద్రత, క్రమశిక్షణతో కూడి ఉండే కోర్టు రూమ్‌లో ఒక పిటిషనర్ ఊహించని విధంగా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏకంగా లైవ్ విచారణ జరుగుతుండగానే న్యాయమూర్తుల ముందే తన కేసుకు సంబంధించిన ఫైళ్లను, పేపర్లను గాల్లోకి విసిరివేసి దురుసుగా ప్రవర్తించాడు. ఈ అనూహ్య పరిణామంతో కోర్టు హాల్‌లో ఉన్న జడ్జిలు, లాయర్లు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ ఆలోక్ అరాథేలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో లాయర్ ఎవరూ లేకపోవడంతో పిటిషనర్ స్వయంగా రంగంలోకి దిగి తన వాదనలను వినిపించాడు. వాదనలు ప్రారంభిస్తూనే.. “లఖ్‌నవూ ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నాను” అని న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడాడు.
అత్యున్నత న్యాయస్థానానికి వచ్చి జడ్జిలకే ఆర్డర్ వేసేలా మాట్లాడటంతో న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ ఒకింత ఆశ్చర్యపోయారు. వెంటనే స్పందిస్తూ.. "మీరు మాకు ఆదేశాలు ఇస్తున్నారా?" అని సదరు పిటిషనర్‌ను ప్రశ్నించారు. అందుకు ఆ పిటిషనర్ ఏమాత్రం తగ్గకుండా.. "నావైపు నుంచి చెప్పాల్సింది ఇంతే. అన్నీ రికార్డులో ఉన్నాయి" అని దురుసుగా బదులిచ్చాడు.
అంతటితో ఆగకుండా తీవ్ర కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి.. చేతిలో ఉన్న కేసు పేపర్లన్నింటినీ జడ్జిల ముందే గాల్లోకి విసిరేశాడు. కోర్టు రూమ్ అంతా ఆ పేపర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. పిటిషనర్ ప్రవర్తనతో కోర్టు హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. వెంటనే అలర్ట్ అయిన సుప్రీం కోర్టు భద్రతా సిబ్బంది (Security) కోర్టు రూమ్‌లోకి దూసుకొచ్చి, ఆ పిటిషనర్‌ను పట్టుకుని వెంటనే బయటకు పంపించేశారు. కాగా, ఈ అవాంఛనీయ ఘటనపై సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా కోర్టు ధిక్కార చర్యల వంటివి వెల్లడించలేదు. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు లీగల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




