Packaged Food Rules: చిప్స్ ప్యాకెట్ వెనుక దాక్కున్న రహస్యాలు..కేంద్రం పై సుప్రీంకోర్టు సీరియస్
Packaged Food Rules:ప్యాకేజ్డ్ ఫుడ్‌పై వార్నింగ్ లేబుళ్ల జాప్యంపై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐకి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాల సమాచారం ప్యాకెట్ ముందే ఉండాలని ఆదేశించింది.
Packaged Food Rules
Packaged Food Rules: చిప్స్ ప్యాకెట్ తెరవడమైనా, టీతో పాటు బిస్కెట్ తినడమైనా నేటి మన బిజీ జీవితంలో సర్వసాధారణమైపోయింది. సూపర్ మార్కెట్లలో కనిపించే ఈ ప్యాకేజ్డ్ ఆహారాన్ని చాలామంది కేవలం ఒక తేలికపాటి స్నాక్‌గా మాత్రమే చూస్తారు. అందులో ఎంత పరిమాణంలో ఉప్పు, చక్కెర, హానికరమైన శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నాయో కొనుగోలుదారులకు ప్యాకెట్ ముందే స్పష్టంగా కనిపించేలా ముద్రించాల్సిన అవసరం ఉందా? ఈ అంశంపైనే గురువారం భారత అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ వార్నింగ్ లేబుళ్లను అమలు చేయడంలో ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ చూపిస్తున్న నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా తుది నిర్ణయం తీసుకోకపోతే, వినియోగదారుల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కోర్టు స్వయంగా ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేసింది.
ప్యాకెట్ ముందు భాగంలో వార్నింగ్ లేబుల్ అంటే ఏమిటి?
ప్రస్తుతం మన మార్కెట్లలో లభించే చాలావరకు ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పోషకాల వివరాలు ప్యాకెట్ వెనుక భాగంలోనో లేక పక్క భాగంలోనో చిన్న అక్షరాలతో ముద్రిస్తారు. ఒక సామాన్య వినియోగదారుడు ఆ వివరాలను చదివి, అందులో చక్కెర, ఉప్పు ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సమస్యకు పరిష్కారంగా ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరిక గుర్తును ఉంచడమే ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ విధానం. దీనివల్ల కొనుగోలు చేసే సమయంలోనే ఆ ఉత్పత్తుల్లో ఆరోగ్యానికి హాని చేసే మూలకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ అనే మోడల్‌ను ప్రతిపాదించింది. ఇందులో పోషకాల నాణ్యత ఆధారంగా 0.5 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇస్తారు.
సుప్రీంకోర్టు ఆగ్రహానికి ప్రధాన కారణాలు ఇవే
సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుళ్ల జారీ ప్రక్రియను ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ నిరంతరం వాయిదా వేస్తూ వస్తోంది. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ వివరాలు కొనుగోలుదారుడికి కొట్టొచ్చినట్లు కనిపించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంలో ఆలస్యం జరిగితే తామే మార్గదర్శకాలు జారీ చేస్తామని హెచ్చరించింది. అయితే ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ మాత్రం స్పష్టమైన వార్నింగ్ లేబుళ్లకు బదులుగా, కేవలం పోషకాల వివరాల పట్టికను ప్యాకెట్ ముందుకు తెస్తామని చెప్పడంపై ఆరోగ్య నిపుణులు, కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిప్స్, బిస్కెట్లతో ఆరోగ్యానికి ఎంత ముప్పు?
ప్రతి చిప్స్ ప్యాకెట్ లేదా బిస్కెట్ ప్యాకెట్ తక్షణమే ప్రాణాంతకం కాకపోవచ్చు. కానీ వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు, సోడియం స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అమెరికాలో 13,172 మందిపై దాదాపు 21 సంవత్సరాల పాటు నిర్వహించిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రతిరోజూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, తీపి పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసం, స్నాక్స్ ఎక్కువగా తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం సాధారణ వ్యక్తుల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రతిదనమూ అదనంగా తీసుకునే ఒక ప్రాసెస్డ్ ఫుడ్ సర్వింగ్ వల్ల మధుమేహం వచ్చే ముప్పు 2 శాతం పెరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.
పొంచి ఉన్న మధుమేహం ముప్పు
భారతదేశంలో ఐసీఎమ్‌ఆర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతీయ ఆహారంలో నాణ్యత లేని పిండి పదార్థాలు, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మన దేశంలో శుద్ధి చేసిన ధాన్యాలు, తెల్ల విసరు బియ్యం, కృత్రిమ చక్కెర వాడకం పరిమితికి మించి ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో ప్రజలు తీసుకునే శాచురేటెడ్ ఫ్యాట్ పరిమాణం వైద్యులు సిఫార్సు చేసిన స్థాయి కంటే దాటిపోయింది. పిండి పదార్థాలు, కొవ్వును తగ్గించి, వృక్ష సంబంధిత ప్రొటీన్లను పెంచడం ద్వారా మాత్రమే భారతీయులు మెటబాలిక్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం వార్నింగ్ లేబుళ్లతో మార్పు వస్తుందా?
ప్యాకెట్‌పై ఎరుపు రంగు హెచ్చరిక చూడగానే ప్రజలు చిప్స్ తినడం పూర్తిగా బంద్ చేస్తారని చెప్పలేం. కానీ రెండు వేర్వేరు బ్రాండ్ల ఉత్పత్తులను పోల్చి చూసి, తక్కువ ఉప్పు లేదా కొవ్వు ఉన్న ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడానికి ఈ లేబుళ్లు బాగా ఉపయోగపడతాయి. వినియోగదారులకు అవగాహన పెంచి, పారదర్శకమైన సమాచారం అందించడం ప్రభుత్వాలు, నియామక సంస్థల బాధ్యత.




