Supreme Court: కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందే!
Supreme Court: మదురై తిరుప్పరంకుండ్రం కొండపై రాతిస్తంభంపై కార్తిక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court: కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందే!
Supreme Court: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న పురాతన రాతిస్తంభంపై కార్తిక పౌర్ణమి నాడు దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని మండిపడ్డ అత్యున్నత న్యాయస్థానం, శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉత్తర్వులను అమలు చేయని తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మదురై కలెక్టర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్టు శిరస్సుకు పైన ఉన్న ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపై ఏళ్లుగా కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే, ఇదే కొండపై ఉన్న సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపై దీపం వెలిగించాలనే అంశంపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. గత ఏడాది మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రాతిస్తంభంపైనే దీపం వెలిగించాలని ఆదేశించినా అమలు కాలేదు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, ఈ ఏడాదికి మాత్రమే రాతిస్తంభంపై కార్తికదీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పక్కనపెట్టి కార్తిక పౌర్ణమి నాడు ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ మండపంపైనే దీపం వెలిగించడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడు పోలీసులు ఉత్తర్వుల అమలులో విఫలమయ్యారని పేర్కొంటూ, ఆలయం మరియు తిరుప్పరంకుండ్రం కొండ భద్రతా బాధ్యతలను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్ (CRPF)కు అప్పగించింది.
విచారణ సందర్భంగా రాతిస్తంభం వద్దకు వెళ్లేందుకు పోలీసులు తమను అనుమతించలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కోర్టుకు తెలిపింది. అయితే, తాము నవంబరు 21 నుంచే ఏఎస్ఐ అధికారులతో సమావేశాలు నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. కొండ వద్ద 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని మదురై పోలీసు కమిషనర్ వివరించారు.
అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. "రాష్ట్ర పాలనా అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అవుతోంది. కోర్టు ఆదేశాలపై చర్చలకు తావులేదు. న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించేవారు ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా సరే సహించేది లేదు" అని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.




