Maternity Leave: ఏ వయసు బిడ్డను దత్తతను తీసుకున్నా మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే.. సుప్రీం కోర్టు

Maternity Leave: దత్తత తీసుకునే పిల్లల వయసుతో సంబంధం లేకుండా మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

KVD Varma
Published on: 17 March 2026 4:40 PM IST
Maternity Leave: దత్తత తీసుకునే పిల్లల వయసుతో సంబంధం లేకుండా మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవు
X

Maternity Leave

Maternity Leave: పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు సుప్రీం కోర్టు ఊరట కలిగించే తీర్పునిచ్చింది. దత్తత తీసుకునే పిల్లల వయసును బట్టి మెరర్నిటీ లీవ్ ఇచ్చే విధానం సరికాదని చెప్పింది. ఏ వయసు పిల్లలను దత్తత తీసుకునే మహిళలకైనా ఇకపై 12 వారాల సెలవుకు అర్హత ఉంటుందని, కేవలం మూడు నెలల లోపు పిల్లలకు మాత్రమే సెలవు మంజూరు చేయడం తప్పు అని పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది

జస్టిస్‌లు జెబి పర్దివాలా, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం, సామాజిక భద్రతా కోడ్, 2020కి సంబంధించిన ఒక కేసును విచారిస్తోంది. ఇది కోడ్‌లోని సెక్షన్ 60(4)ను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. బిడ్డ వయస్సు మూడు నెలల కంటే తక్కువ ఉండాలనే నిబంధనను కూడా తొలగించింది.

వయస్సు ఆధారంగా సెలవు మంజూరు చేయడం తప్పు అని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘిస్తుందని వాదిస్తూ, హంసానందిని నందూరి ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ పై సుప్రీం కోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.

అంతేకాకుండా, పితృత్వ సెలవును చట్టంలో చేర్చాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాని వ్యవధిని తల్లిదండ్రులు, బిడ్డ అవసరాల ఆధారంగా నిర్ణయించాలని కోర్టు పేర్కొంది.

అసలు విషయం ఏమిటంటే..

హంసానందిని నందూరి 2017లో ఇద్దరు పిల్లలను (4.5 సంవత్సరాల బాలిక - 2 సంవత్సరాల బాలుడు) దత్తత తీసుకున్నారు. ఆమె సెలవు కోరినప్పుడు, పిల్లల వయస్సు మూడు నెలలు దాటినందున, ఒక్కొక్కరికి కేవలం ఆరు వారాలు మాత్రమే మంజూరు చేశారు.

3 నెలల వయోపరిమితి అన్యాయమైనదని, వివక్షాపూరితమైనదని, రాజ్యాంగ విరుద్ధమైనదని వాదిస్తూ 2021లో నందూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది పిల్లల సంరక్షణ కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు కాబట్టి, పితృత్వ సెలవును చట్టంలో చేర్చాలన్నారు. దత్తత తీసుకునే బిడ్డకు 3 నెలల వయస్సు ఉండాలనే నిబంధన తప్పు, వివక్షాపూరితమైనదని చెప్పారు. ఇది రాజ్యాంగంలోని 14వ ప్రకరణ (సమానత్వ హక్కు) ఉల్లంఘన అంటూ వాదించారు.

సుప్రీం కోర్టు ఏమందంటే..

పితృత్వ సెలవును సామాజిక భద్రతా ప్రయోజనంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని కోర్టు సూచించింది. అలాగే, ఈ సెలవు కాల వ్యవధిని తల్లిదండ్రులు బిడ్డ అవసరాలకు అనుగుణంగా నిర్ణయించాలని చెప్పింది.

పిల్లల పెరుగుదల ప్రారంభంలో తల్లిదండ్రులిద్దరి పాత్ర ముఖ్యమైనది అని చెప్పిన కోర్టు బిడ్డ వయస్సు 3 నెలల కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దత్తత తల్లికి సెలవు మంజూరు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టంగా పేర్కొంది. అలానే ఇకపై ఏ వయసు బిడ్డను దత్తత తీసుకునే మహిళకైనా ప్రసూతి సెలవు లభిస్తుందని చెప్పింది. .

అసలు మెటర్నిటీ లీవులు మన దేశంలో ఎలా అంటే..

మహిళలకు ప్రసూతి సెలవుకు హక్కు ఉన్నప్పటికీ, భారతదేశంలో పితృత్వ సెలవుకు ఇంకా చట్టపరమైన గుర్తింపు లభించలేదు.

ఇక మహిళలకు మొదటి ఇద్దరు పిల్లల వరకు: 26 వారాల వేతనంతో కూడిన సెలవు.. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలకు: 12 వారాల సెలవు ఉంటుంది. దీనిలో, డెలివరీకి ముందు 8 వారాల సమయం కూడా కలపవచ్చు.

KVD Varma

KVD Varma

Next Story