Diwali bonus: దీపావళి గిఫ్ట్.. ఉద్యోగుల చేతికి లక్ష రూపాయల నోట్ల పళ్లెం
Diwali bonus: సూరత్‌కు చెందిన టెక్స్‌టైల్ వ్యాపారి రామ్‌స్వరూప్ తమ ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రూ. 1 లక్షకంటే ఎక్కువ నగదును వెండి పళ్లెంలో పేర్చి అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Diwali bonus: దీపావళి గిఫ్ట్.. ఉద్యోగుల చేతికి లక్ష రూపాయల నోట్ల పళ్లెం
Diwali bonus Surat: దీపావళి వచ్చిందంటే చాలు.. గుజరాత్‌లోని సూరత్ వ్యాపారుల స్టైలే వేరు. తమ ఎదుగుదలకు కారణమైన సిబ్బందిని కేవలం జీతగాళ్లుగా కాకుండా, సొంత కుటుంబ సభ్యుల్లా భావించడం అక్కడ ఒక సంప్రదాయం. కోట్లాది రూపాయల విలువైన బహుమతులతో దీపావళి వెలుగులు నింపడం సూరత్ బ్రాండ్ మార్క్. తాజాగా అక్కడి ఓ టెక్స్‌టైల్ వ్యాపారి ఇచ్చిన సర్ప్రైజ్ చూసి ఉద్యోగులతో పాటు సోషల్ మీడియా కూడా నోరెళ్లబెడుతోంది.
సూరత్‌కు చెందిన టెక్స్‌టైల్ వ్యాపారి రామ్‌స్వరూప్ తన వద్ద పనిచేస్తున్న 20 మంది ఉద్యోగుల పట్ల చూపించిన ప్రేమాభిమానాలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి.ఉద్యోగుల జీతాలను బ్యాంక్ ఖాతాల్లో వేయడమే కాకుండా.. రూ. 10 నుంచి రూ. 500 వరకు వివిధ రకాల కరెన్సీ నోట్ల కట్టలను వెండి పూజా పళ్లెంలో అందంగా పేర్చారు. లక్ష్మీదేవి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఒక్కో ఉద్యోగికి ఏకంగా రూ. 1 లక్షకు పైగా నగదున్న పళ్లెంను స్వయంగా తమ చేతులతో అందించారు. ఊహించని రీతిలో చేతికి లక్ష రూపాయల నోట్ల పల్లెం రావడంతో పలువురు ఉద్యోగులు ఆనందాశ్చర్యాలతో కంటతడి పెట్టారు.
తన దాతృత్వంపై స్పందించిన యజమాని రామ్‌స్వరూప్ మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉద్యోగుల కష్టమే మన కంపెనీ ఎదుగుదలకు అసలైన కారణం. వారే మన నిజమైన సంపద అని ఆయన పేర్కోడం విశేషం. ప్రస్తుతం ఈ పంపిణీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సూరత్‌లో ఇలాంటి సంచలన బోనస్‌లు ఇవ్వడం ఇప్పటిది కాదు. ఈ సరికొత్త సంస్కృతికి 'హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్' అధినేత సావ్‌జీభాయ్ ధోలేకియా ఆద్యుడిగా నిలిచారు.
గతంలో ఒకే ఏడాది వందలాది మంది ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్లు, 400 కంటే ఎక్కువ ప్లాట్లను బోనస్‌గా ఇచ్చి ధోలేకియా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మరో వైపు జ్యువెలరీ వ్యాపారులు లక్షల విలువైన ప్లాటినం ఆభరణాలు అందిస్తే.. కొన్ని కంపెనీలు తమ వద్ద పనిచేసే డ్రైవర్లు, మేనేజర్లతో సహా అందరికీ సమాన ప్రాధాన్యమిస్తూ 'ఫారిన్ టూర్ ప్యాకేజీలు' బహుమతిగా ఇచ్చాయి. కష్టపడే ప్రతి ఉద్యోగికి తగిన గుర్తింపు, గౌరవం ఇస్తే ఆ సంస్థ మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందని నిరూపిస్తున్న ఈ గుజరాత్ పారిశ్రామికవేత్తల తీరు దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.




