మమతా బెనర్జీ కాలి గాయం నకిలీదే.. సువేందు అధికారి సంచలన ఆరోపణలు.. విచారణకు ఆదేశం!
2021 ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కాలికి గాయం అయినట్లు నటించారని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు.
మమతా బెనర్జీ కాలి గాయం నకిలీదే.. సువేందు అధికారి సంచలన ఆరోపణలు.. విచారణకు ఆదేశం!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిగ్రామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, అప్పట్లోని సీఎం మమతా బెనర్జీ కాలికి గాయం కావడమనేది కేవలం నటనేనని బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. ఆ గాయం నకిలీదని నిరూపించేందుకు తన వద్ద పక్కా సాక్ష్యాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తాజాగా పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
మమత నాటి ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో ఆమె కాలి ఎముక విరిగినట్లు మెడికల్ రిపోర్ట్స్‌లో ఎటువంటి అధికారిక ఆధారాలు లేవని సువేందు అధికారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిశీలిస్తోందని, రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత విచారణకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
2021లో అసలేం జరిగింది..?
2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగ్రామ్‌లో ఉన్న సమయంలో మమతా బెనర్జీపై కొందరు దాడి చేశారని, ఆ ఘటనలో ఆమె కాలికి తీవ్ర గాయమైందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చారు. వీల్‌చైర్ లో కూర్చుని ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా ఈసీ ప్రత్యేక పరిశీలకులైన వివేక్ దూబే, అజయ్ నాయక్‌లను ఆదేశించింది.
ఆ ఘటన ఎలాంటి పథకం ప్రకారం జరిగిన దాడి కాదని, అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందేనని ఆ నివేదిక స్పష్టం చేసింది. మమత కాన్వాయ్‌పై ముందస్తు కుట్రతో దాడి జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని తేల్చింది. అయితే, భద్రతాపరమైన లోపాలకు బాధ్యులైన కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే ఈసీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై మళ్లీ విచారణకు ఆదేశించడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




