Suvendu Adhikari: బెంగాల్లో చొరబాటుదారులకు సీఎం సువేందు అల్టిమేటం.. మేము వెళ్లగొట్టకముందే పారిపోండి!
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్లో అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులపై సీఎం సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
Suvendu Adhikari: బెంగాల్లో చొరబాటుదారులకు సీఎం సువేందు అల్టిమేటం.. మేము వెళ్లగొట్టకముందే పారిపోండి!
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. అక్రమ వలసదారులపై (Bangladeshi Infiltrators) ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్‌తో ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను తిరిగి వారి స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం సువేందు అధికారి చొరబాటుదారులకు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్ ప్రభుత్వం తమను బలవంతంగా వెళ్లగొట్టకముందే, స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి పారిపోవాలని ఆయన సూచించారు.
బంగ్లాదేశ్ ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న విదేశీయుల చట్టానికి లోబడే తమ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
"చొరబాటుదారులుగా గుర్తింపు పొందిన వారిని జైళ్లలో పెట్టాల్సిన అవసరం లేదు. వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించి, తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా? భారత భూభాగం నుండి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి వారిని తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత పూర్తిగా అక్కడి ప్రభుత్వంపైనే ఉంది" అని సువేందు అధికారి ఘాటుగా వ్యాఖ్యానించారు.
బెంగాల్ సర్కార్ ప్రస్తుతం “గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి” (Identify, Isolate, Exile) అనే త్రిసూత్ర నినాదంతో అక్రమ విదేశీయులను దేశం దాటించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే సరైన వీసా, పాస్‌పోర్ట్ పత్రాలు లేకుండా అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడిన వారిని తాత్కాలికంగా ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్బంధ కేంద్రాలను (Holding Centres) ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మాల్దా (Malda) జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి నిర్బంధ కేంద్రాన్ని అధికారులు అధికారికంగా ప్రారంభించారు. త్వరలోనే సరిహద్దు జిల్లాల్లో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
సువేందు అధికారి ప్రభుత్వం తీసుకుంటున్న వరుస కఠిన చర్యలతో అక్రమ వలసదారుల్లో వణుకు మొదలైంది. దీంతో వారంతా కట్టకట్టుకుని తిరిగి బంగ్లాదేశ్‌కు పయనమవుతున్నారు. మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్ సరిహద్దు ప్రాంతంలో పదుల సంఖ్యలో బంగ్లాదేశీయులు గుమిగూడినట్లు సరిహద్దు భద్రతా అధికారులు వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో ‘సెర్చ్’ ప్రక్రియ చేపట్టిన సమయంలో కూడా ఇదే సరిహద్దు గుండా వందలాది మంది బంగ్లాదేశ్‌కు పారిపోయినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బెంగాల్ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.




