Tamil Nadu: తమిళ రాజకీయాల్లో పెను మార్పులు.. చీలిన ఏఐఏడీఎంకే...

Tamil Nadu: తమిళనాడు శాసనసభలో రాజకీయ వేడి. ఏఐఏడీఎంకేలో పళనిస్వామికి వ్యతిరేకంగా వేలుమణి వర్గం తిరుగుబాటు. ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా గుర్తింపు. రేపు సీఎం విజయ్ బలనిరూపణ.

Arun Chilukuri
Published on: 12 May 2026 9:58 AM IST
Tamil Nadu
X

Tamil Nadu: తమిళ రాజకీయాల్లో పెను మార్పులు.. చీలిన ఏఐఏడీఎంకే...

Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఒకవైపు కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK) నిలువునా చీలిపోయింది. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎంపిక నేడు జరగనుండగా, రేపు (బుధవారం) ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోనుంది.

నిన్న జరిగిన కార్యక్రమంలో మొత్తం 232 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐఏడీఎంకే నేత సి.వి. షణ్ముగం మినహా మిగిలిన వారందరూ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ పేరు ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.

వరుస ఓటములతో సతమతమవుతున్న ఏఐఏడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వంపై తిరుగుబాటు మొదలైంది. పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ సి.వి. షణ్ముగం, వేలుమణి, విజయ భాస్కర్ వర్గం వేరు కుంపటి పెట్టింది.

పళనిస్వామి వర్గం: ఓఎస్ మణియన్, తలైవ సుందరం నేతృత్వంలోని 17 మంది ఎమ్మెల్యేలు తాత్కాలిక స్పీకర్‌ను కలిసి, పళనిస్వామిని శాసనసభ పక్ష నాయకుడిగా గుర్తించాలని లేఖ ఇచ్చారు.

తిరుగుబాటు వర్గం: సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు మరో వర్గంగా ఏర్పడ్డారు. ఎస్.పి. వేలుమణిని శాసనసభ పక్ష నేతగా, విజయ్ భాస్కర్‌ను విప్‌గా నియమించాలని వారు తాత్కాలిక స్పీకర్ కరుప్పియాకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతానికి అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉండగా, మూడో పెద్ద పార్టీగా ఉన్న ఏఐఏడీఎంకేలో అసలు నాయకుడు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. నిన్న అసెంబ్లీకి కూడా పళనిస్వామి వర్గం, వేలుమణి వర్గం విడివిడిగా హాజరుకావడం పార్టీలో చీలికను స్పష్టం చేస్తోంది. ఈ రాజకీయ సంక్షోభం మధ్య రేపు జరగబోయే విజయ్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story