Tamil Nadu: విమాన ఇంధనంపై భారీ కోత.. విజయ్ నిర్ణయానికి కేంద్ర మంత్రి ఫిదా!
Tamil Nadu: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో తమిళనాడులోని టీవీకే (TVK) ప్రభుత్వం విమానయాన సంస్థలకు భారీ ఉపశమనం అందించింది.
Tamil Nadu: విమాన ఇంధనంపై భారీ కోత.. విజయ్ నిర్ణయానికి కేంద్ర మంత్రి ఫిదా!
Tamil Nadu: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో తమిళనాడులోని టీవీకే (TVK) ప్రభుత్వం విమానయాన సంస్థలకు భారీ ఉపశమనం అందించింది. విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ఏటీఎఫ్) పై విధిస్తున్న విలువ ఆధారిత పన్నును (వ్యాట్) గణనీయంగా తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నై విమానాశ్రయంలో ఈ పన్నును గతంలో ఉన్న 29 శాతం నుంచి 16 శాతానికి తగ్గించగా, రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రాంతీయ విమానాశ్రయాల్లో ఏకంగా 1 శాతం స్థాయికి తగ్గించింది. ఈ నిర్ణయంతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు.
విమానయాన రంగానికి మేలు.. కేంద్ర మంత్రి ధన్యవాదాలు
తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతించారు. విమాన ప్రయాణాలను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇరు ప్రభుత్వాల ముఖ్య ప్రాధాన్యత ఎప్పుడూ ప్రయాణికుల సౌకర్యమే కావాలని స్పష్టం చేస్తూ, ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. విమాన ఇంధనం జీఎస్టీ పరిధిలోకి రాకపోవడం వల్ల, పన్ను రేట్లను నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
పన్నుల తగ్గింపు ఎందుకు అత్యంత ప్రాధాన్యం?
సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చు సుమారు 30 నుంచి 40 శాతం వరకు ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇది ఏకంగా 55 నుంచి 60 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ఉద్రిక్తతల కారణంగా జెట్ ఇంధనం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీనికి తోడు రూపాయి విలువ క్షీణించడం, పాకిస్థాన్ తన వైమానిక రంగాన్ని మూసివేయడం వల్ల విదేశీ విమాన సర్వీసులకు అదనపు సమయం, ఇంధనం ఖర్చవుతున్నాయి. రాబోయే పండుగల సీజన్‌లో ఇంధన ధరల భారాన్ని తట్టుకోలేక లాభసాటి కాని మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తామని విమానయాన సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చింది.
తమిళనాడు ప్రభుత్వ ప్రణాళిక.. కొత్త విమాన సర్వీసులకు ప్రోత్సాహం
తమిళనాడు పారిశ్రామిక శాఖ మంత్రి విరుదై మగల్ కీర్తన ఈ నిర్ణయంపై స్పందిస్తూ, విమాన ప్రయాణాలను ప్రజలందరికీ దగ్గర చేయడంతో పాటు ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో ఇది ఒక నిర్ణయాత్మక అడుగు అని వెల్లడించారు. తక్కువ నిర్వహణ వ్యయం వల్ల విమాన సంస్థలు చెన్నైతో పాటు ఇతర నగరాలకు కొత్త రూట్లలో సర్వీసులను పెంచేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెన్నైలో వ్యాట్ 16 శాతానికి, ఇతర నగరాల్లో 1 శాతానికి తగ్గగా, 40 వేల కిలోల కంటే తక్కువ బరువున్న చిన్న విమానాలకు విధించే వ్యాట్‌ను కూడా 5 శాతం నుండి 1 శాతానికి తగ్గించారు. ఈ నూతన రేట్లు 2027 అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటాయి.




